తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కేటాయిస్తూ జీవో జారీ చేయగా, ఆ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది.
శాసనసభ సమావేశాలలో బీసీ రిజర్వేషన్స్‌కు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు దీనిని తప్పు పడుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, “బీసీ రిజర్వేషన్స్‌పై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోంది. జీవోతోనే రిజర్వేషన్స్ సాధ్యమైతే అసెంబ్లీ సమావేశం దేనికి? దానిలో ఏకగ్రీవ తీర్మానం దేనికి? మళ్ళీ దానిని గవర్నర్, రాష్ట్రపతికి ఎందుకు పంపారు?
బీసీ రిజర్వేషన్స్ కోసం జీవో తెచ్చినట్టే తెచ్చి మరోపక్క దానిపై వాళ్ళే కోర్టులో కేసులు వేయించారు. కోర్టులో కేసు ఉందని తెలిసి ఉన్నా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ జీవో చెల్లదని వారికి తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఇలాగే జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచితే కోర్టులు కొట్టేశాయని కూడా ఈ ప్రభుత్వానికి తెలుసు.
ఉదాహరణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాగే జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించబోతే సుప్రీం కోర్టు మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసింది. ఒకవేళ ఎన్నికలు జరిగి వాటిని సుప్రీంకోర్టు రద్దు చేస్తే పోటీ చేసిన బీసీలు ఆర్థికంగా నష్టపోతారు కూడా. రేపు తెలంగాణలో కూడా ఇలాగే జరిగితే ప్రజలకు, బీసీలకు ఏం సమాధానం చెపుతారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ పేరుతో బీసీలను మభ్యపెడుతోంది,” అని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ఆయన కంటే సీనియర్ నేత, రెండుసార్లు మంత్రిగా పనిచేసి కేసీఆర్, కేటీఆర్‌లకు అత్యంత సన్నిహితుడైన హరీష్ రావు కాస్త భిన్నంగా మాట్లాడటం విశేషం. ఆయనేమన్నారంటే, “స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు. ఈ రెండేళ్ళలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఎగవేసింది. ఈ ప్రభుత్వం ఎంతెంత చెల్లించాలో మేము ‘బాకీ కార్డులు’ ముద్రించి ప్రజలకు అందజేశాము. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను వాటిని చూపించి నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
అంటే స్థానిక సంస్థల ఎన్నికలు తప్పక జరుగుతాయని హరీష్ రావు భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. పాతికేళ్ళుగా రాజకీయాలలో ఉంటూ, పదేళ్ళు అధికారంలో కూడా ఉన్న బీఆర్ఎస్ పార్టీకే బీసీ రిజర్వేషన్స్‌పై స్పష్టత లేదని అర్ధమవుతోంది.
మరి బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ లభిస్తాయా లేదా అనే విషయం ఈ ఎన్నికలు సక్రమంగా జరిగితే తెలుస్తుంది.




