చంద్రబాబు అరెస్ట్ సంఘటన నేటికీ ఏపీలో రాజకీయ దుమారాన్ని లేపుతూనే ఉంది. రాష్ట్రంలో జరిగే నిరసనలకు తోడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఐటీ ఉద్యోగుల ఛలో రాజమండ్రి కార్ల ర్యాలీ పిలుపు వైసీపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. బాబు అరెస్టు ను ఖండిస్తూ అక్కడి బిఆర్ఎస్ ప్రభుత్వ ఆంక్షలను ఖాతరు చేయక హైద్రాబాద్ లో ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబుకి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. అయితే వారి నిరసన సెగ ఆంధ్రా వరకు విస్తరిస్తుందని ఊహించని జగన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
జగన్ తన కనుసన్నలతో నడుపుతున్న పోలీస్ వ్యవస్థను తెంగాణ – ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలలో మోహరించి ఛలో రాజమండ్రి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుండడం వైసీపీ ప్రభుత్వ నియంత పాలనను సూచిస్తుంది. ఐటీ ఉద్యోగులను పోలీస్ వ్యవస్థ అడ్డుకుంటున్న తీరు చూస్తుంటే జగన్ ఇక రానున్న కాలంలో నిజంగా ఏపీ కి రావాలంటే ‘వీసా – పాస్ పోర్ట్’ తప్పనిసరి చేస్తారేమో అన్న సందేహం ప్రతి ఒక్కరి మనస్సులో మెదులుతుంది.
తమకు నచ్చిన నేతకు అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలిపే హక్కు తమకు లేదా? తమ నేతకు తామంతా అండగా ఉన్నాం అంటూ సంఘీభావం పలికే స్వేచ్ఛ తమకు లేదా? భారత దేశంలో ఉండే ఏ రాష్ట్రానికైనా వెళ్లే స్వాతంత్రీయం తమకు లేదా? ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగం కాదా? చివరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా కాశ్మీర్ దాకా వెళ్లగలుగుతున్నాం కానీ పక్క రాష్ట్రమైనా ఆంధ్రాకు రావడానికి ఇన్ని ఆంక్షలా? ఏపీ కి రావాలంటే “జగనన్నా వీసా – పాస్ పోర్ట్” పధకానికి అర్హులై ఉండాలా? అంటూ ఐటీ ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని దేశ ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నాయి.



