గత కొద్దిరోజులుగా ఎటుచూసినా రెండు తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు అరెస్ట్ చుట్టే వార్తలు తిరుగుతున్నాయని చెప్పక తప్పదు. ఆవు కథ మాదిరి బాబు కథ నడుస్తుంది. బాబు అరెస్టుతో ఆ పార్టీ నేతలు.. సానుభూతు పరులు రెండు రాష్ట్రాలలో నిరసనల కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఉమ్మడి ఏపీలో హైద్రాబాద్ లో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు బాబు. ఆ కృతజ్ఞతతోనే తెలంగాణాలో కూడా స్వచ్ఛందంగా ఐటీ ఉద్యోగులు, పార్టీ సానుభూతి పరులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను వ్యక్తం చేయడం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమాలపై కొంచెం అతిగా స్పందిస్తుండం విమర్శలకు తావిస్తుంది.
ఈరోజు సాయంత్రం మర్రి చెట్టు కూడలి వద్ద నిరసనకు..,రేపు నానక్ రామ్ గూడ టోల్గేట్ వద్ద ర్యాలీ.., నిర్విహించడానికి ఐటీ ఉద్యోగులు పిలుపునిచ్చారు. అయితే అందుకు పోలీస్ శాఖ “లా అండ్ ఆర్డర్” ఇష్యు వస్తుందనే నెపంతో అనుమతిని నిరాకరించింది. ఐటీ ఉద్యోగుల నిరసన ప్రభుత్వం కంట్రోల్ చేయలేని స్థాయిలో ఉంటుందా? లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉందా?
ఈ విషయం బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియంది కాదు! ప్రభుత్వ పెద్దలు అనవసరంగా ఈ విషయాన్ని కదిలించి హైద్రాబాద్ లో ఉంటున్న సెట్లర్స్ ఓట్లను దూరం చేసుకున్న వారవుతారు. హైద్రాబాద్ లో ఇప్పటికి సెట్లర్స్ ఓట్లే కీలకం. నేతల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో హైద్రాబాద్ లో స్థానికేతరులు నివసిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్రానికి ఆయువుపట్టే హైద్రాబాద్. హైద్రాబాద్ కి ఆయువుపట్టు ఐటీ రంగం. ఇప్పుడు ఆ ఉద్యోగులే రోడ్ల మీదకు వచ్చింది. వారు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేఖంగానో లేక తమ సమస్యలు పరిష్కరించండో అంటూ రోడ్ల మీదకు రాలేదు. తాము జీవితంలో ఎదగడానికి అవకాశం కలిపించిన నేత ఇప్పుడు సమస్యలలో ఉన్నాడు కాబట్టే తమ సంఘీభావం తెలుపుతున్నామని ఐటీ ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు ఎవరి ప్రాపకం కోసమో అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద కర్ర తో కొట్టాలని చూస్తుంది.
గత దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం అసలే ప్రభుత్వ వ్యతిరేకతను మోస్తుంది.., ఇందుకు తోడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణాలో తన జెండా ఎగరేయాలనే ఎజెండాతో ముందుకెళ్తున్నారు. ఈసారి బిఆర్ఎస్ పార్టీకి గెలుపు నల్లేరు మీద నడక మాదిరి ఉండదు. అటువంటి సందర్భంలో ఇటువంటి చిన్న చితక కార్యక్రమాలను కెలికి వ్యతిరేకతను పెంచుకోవడం తప్ప ప్రభుత్వానికి ఒరిగేదేమి ఉండదు.



