ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకున్న ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా నేటి యువతరం సోషల్ మీడియాలో నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలను వెల్లడించడంలో ముందుంటున్నారు. దీంతో సోషల్ మీడియాకున్న ప్రాధాన్యత రీత్యా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ అంశంపై దృష్టి సారించారు. ఎందుకంటే, సోషల్ మీడియాలో కేసీఆర్ పైన, తెలంగాణ ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండడంతో, పార్టీ వర్గాల్లో కలకలం రేగింది.
విద్యావంతులు, యువత చురుగ్గా ఉండడంతో పలు విమర్శలతో కూడిన వినూత్న అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇవి కేసీఆర్ సర్కార్ కు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. దీనికి తోడు వీక్షకులను ఆకర్షించే విధంగా, కాస్త కామెడీగా ఉన్న పోస్టులు కాస్త వైరల్ అవుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ ను కాని, ప్రభుత్వాన్ని కాని దూషిస్తూ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టినా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని సైబర్ క్రైమ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు నిబంధనలను సైబర్ క్రైమ్ పోలీసులు సిద్దం చేసినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో ప్రతిపక్షాలు, మరికొంతమంది కలసి సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు అప్ లోడ్ చేస్తున్నారని, ఈ పోస్టులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక పోలీసుల నిఘా కొనసాగుతుందని వారు వెల్లడించారు. ఇలాంటి పోస్టింగ్స్ ఆరోగ్యకరం కాదని, ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకోవాలని వారు హితవు పలుకుతున్నారు. ఇలా ఒకరిని కించపరిచే విధంగా పోస్టింగులు పెట్టడం ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.



