తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఈసారి కూడా బిఆర్ఎస్ పార్టీయే దూసుకుపోతున్నప్పటికీ, కొన్ని రాజకీయ పరిణామాలు కలిసిరావడంతో ఈసారి కాంగ్రెస్ విజయావకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో అధికార వైసీపి టిడిపిపై కేసులు పెట్టి పోటీలో లేకుండా అడ్డుతొలగించుకోవాలనుకొంటోంది. కానీ తెలంగాణలో బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు తమ ప్రత్యర్దుల విశ్వసనీయతను దెబ్బ తీసి పైచేయి సాధించాలని ప్రయత్నిస్తుండటమే విశేషం.
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు వింటే ఇది అర్దమవుతుంది. “కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు చాలా మందే ఉన్నారు. వారిద్వారానే ఆయన కాంగ్రెస్‌లో కులాల కొట్లాటలు పెట్టిస్తున్నాడు.
కాంగ్రెస్ అభ్యర్ధులు ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా కేసీఆరే డబ్బు ఇస్తున్నాడు. వాళ్ళు ఎన్నికలలో గెలిచిన తర్వాత కేసీఆర్ ఇలా చిటికేసి పిలవగానే వారు వచ్చి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోతారు. ఓ విదంగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు ఎమ్మెల్యేలను సరఫరా చేసే ఏటిఎం వంటిది. దానిలో నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంతమంది కావాలంటే అంత మంది ఎమ్మెల్యేలను ఆయన తీసుకొంటుంటాడు. ఈసారి కూడా అదే జరుగబోతోంది,” అని అన్నారు.
మరో బిఆర్ఎస్ నేత మర్రి మనోహర్ రెడ్డి ఏమన్నారంటే, “పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకొంటున్నాడు. మహేశ్వరం టికెట్‌ని బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డికి రూ.10 కోట్లకు అమ్ముకొని, వారి వద్ద నుంచి 5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా తన పేరిట రిజిస్టర్ చేయించుకొన్నాడు. ఇంకా చాలామంది వద్ద రేవంత్ రెడ్డి 5,10 కోట్లు చొప్పున వసూలు చేసిన్నట్లు విన్నాను,” అని ఆరోపించారు.
ఇటువంటి ఆరోపణలు ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం పోగొడతాయని వేరే చెప్పక్కరలేదు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్‌పై ఇటువంటి ఆరోపణలు చేస్తుంటే, ఆ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితని ఈడీ అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈవిదంగా ప్రత్యర్దుల విశ్వసనీయతను దెబ్బ తీస్తూ పైచేయి సాధించాలని మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించి అడ్డుతొలగించుకోవాలనే దురాలోచన కంటే ఇదే కాస్త నయమనిపిస్తుంది కదా?