కేసీఆర్‌కి స్వాగతం చెపితే తెలంగాణకు గర్వకారణం కానీ….

grand-welcome-to-chandrababu-naidu-in-hyderabad

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు జాతీయవాదం, జాతీయ స్పూర్తి అంటారు. అదే రాష్ట్రంలో ఎన్నికలొచ్చినప్పుడు తెలంగాణవాదం అంటారు.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు చేయడానికే టిఆర్ఎస్ పేరుని బిఆర్ఎస్ పార్టీగా మార్చేసుకున్నారు కానీ నేటికీ ప్రాంతీయవాదాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు.

ADVERTISEMENT

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల పేరుతో 600 కార్లతో మహారాష్ట్రపై దండయాత్ర చేశారు. ఆంధ్రా, మహారాష్ట్ర, ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ పేరుతో ఆంధ్రా రాజకీయాలపై పట్టు సాధించాలనుకున్నారు. కుమారస్వామికి ఆశ చూపించి కర్ణాటక రాజకీయాలలో కూడా వేలు పెట్టాలనుకున్నారు. ఏమంటే తమది జాతీయ పార్టీ, తాను చేస్తున్నది జాతీయ రాజకీయాలని కేసీఆర్‌ సమర్ధించుకున్నారు.

కానీ తెలంగాణ రాజకీయాలకు మాత్రం ఈ సూత్రం వర్తించదంటారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి తప్ప మరే ఇతర పార్టీలకు రాజకీయాలు చేసే అర్హత కూడా లేదంటారు. ఏమంటే తాను ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి తెలంగాణ సాధించుకున్నాను కనుక దానిపై (అవినీతితో సహా) సర్వహక్కులు తనకు మాత్రమే ఉంటాయని వాదిస్తుంటారు.

అయితే కేసీఆర్‌ టిఆర్ఎస్ పార్టీ స్థాపించక ముందు నుంచే తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ, టిడిపిలున్నాయనే సంగతి గుర్తులేన్నట్లు మాట్లాడుతుంటారు.

అందుకే కాంగ్రెస్‌పై ఢిల్లీ పార్టీ అని, బీజేపీపై గుజరాతీ పార్టీ అని, టిడిపిపై ఆంధ్రా పార్టీ అని ముద్రలు వేసేసి అవన్నీ తాను కష్టపడి సాధించి అభివృద్ధి చేసుకున్న తెలంగాణను దోచేసుకోవడానికి వచ్చాయంటూ కేసీఆర్‌ వితండవాదన చేస్తుంటారు.

గతంలో చక్రవర్తులు, రాజులు ఇతర రాజ్యాలపై దండయాత్రలు చేసి తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేవారు. అదే సమయంలో తమ రాజ్యంపై ఎవరూ దండయాత్ర చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. వారిలో కొందరి అంతిమ లక్ష్యంగా ఢిల్లీ ఉండేది.

కేసీఆర్‌ కూడా సరిగ్గా అదేవిదంగా వ్యవహరిస్తున్నారు కదా?ఆయనలో కూడా అటువంటి రాచరికపు పోకడలే కనిపిస్తున్నాయి కదా?

విభజన సమస్యలపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి నేడు సమావేశం కాబోతుంటే, 80 వేల పుస్తకాలు చదివిన మేధావినైన తానే చేయలేకపోయిన పనిని వారు చేస్తున్నందుకు కేసీఆర్‌ వారిని స్వాగతించాలి. తెలంగాణ పట్ల ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాజీ సిఎంగా వారికి అవసరమైన సలహాలు కూడా ఈయవచ్చు.

కానీ చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నప్పుడు ఆయనకు స్వాగతం చెపుతూ టిడిపి నేతలు పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్లనే బిఆర్ఎస్ పార్టీ తప్పు పడుతోంది.

కేసీఆర్‌కు స్వాగతం చెపుతూ ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రా, చివరికి ఝార్ఖండ్‌లో కూడా ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించుకుంటే అది బిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వకారణం.

కానీ పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు వస్తే ఆయనకు స్వాగతం చెపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు పెడితే అది క్షమించరాని నేరం! తెలంగాణ దోచుకోవడానికి వస్తున్నవారికి స్వాగతం చెప్పిన్నట్లే అంటోంది బిఆర్ఎస్ పార్టీ!

“కాంగ్రెస్‌ నేతలు అసమర్ధులని కనుక ఏదో ఓ రోజు చంద్రబాబు నాయుడు వారిని అడ్డుపెట్టుకొని తెలంగాణ రాష్ట్రంపై పెత్తనం చేయడానికి వస్తారంటూ కేసీఆర్‌ ఇదివరకు ఏదో సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

అంటే కేసీఆర్‌ తాను సమస్యలను పరిష్కరించలేరు మరొకరిని పరిష్కరించనివ్వరన్న మాట! తనకు తప్ప మరొకరికి అంత తెలివితేటలు, చిత్తశుద్ధి లేవనుకుంటున్నారన్న మాట! ఈ అహంకారంమే బిఆర్ఎస్ పార్టీ పతనానికి కారణమని నేటికీ గ్రహించలేదని కూడా అర్దమవుతోంది.

చంద్రబాబు నాయుడుకి స్వాగతం చెపుతూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీ బ్యానర్స్ పెడితేనే బిఆర్ఎస్ పార్టీ ఇంత రాజకీయాలు చేస్తోంది. రేపు విభజన సమస్యలపై మరే స్థాయిలో రాజకీయాలు చేయబోతోందో?

అందుకే చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి కేవలం విభజన సమస్యలను పరిష్కరించుకోవడంపై మాత్రమే దృష్టి పెడితే సరిపోదు. కేసీఆర్‌ సెంటిమెంట్ రాజకీయాలు చేయకుండా, చేసి మళ్ళీ బలపడకుండా అడ్డుకోవడం కూడా చాలా చాలా ముఖ్యమే. లేకుంటే కేసీఆర్‌ రాజకీయాలకు మళ్ళీ వారిద్దరూ బలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories