ఎవరి బాబు నీళ్ళవి? నిజమే ఎవరి బాబువి కావు!

BRS Chandrababu Naidu Telangana water dispute

తెలంగాణలో కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో బీఆర్ఎస్‌ పార్టీ నిత్యం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తూనే ఉంటుంది. దాని సొంత మీడియాలో చంద్రబాబు నాయుడు జలదోపిడీకి పాల్పడుతున్నారంటూ కథనాలు ప్రచురిస్తూనే ఉంటుంది. అయితే తెలంగాణకు దిగువన ఉన్న ఆంధ్రా జల దోపిడీకి పాల్పడటం ఏమిటి?అని ఆలోచిస్తే బీఆర్ఎస్‌ నీళ్ళ పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తోందని అర్ధమవుతుంది.

తాజాగా నమస్తే తెలంగాణ, బీఆర్ఎస్‌ పార్టీ సోషల్ మీడియాలో ‘ఎవరి బాబు నీళ్ళవి?’ అంటూ రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడుల ఫోటోలతో ఓ పెద్ద కథనం ప్రచురించింది.

ADVERTISEMENT

దానిలో ఇటు 70 కిమీ ఎందుకు రావు? అటు 700 కిమీ నీళ్ళు ఎలా పారాయి? అంటూ సిఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించింది.

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకే తెలంగాణ గుండా పారుతున్న కృష్ణా, గోదావరి నీటిని జలశయాలలో ఎత్తిపోయకుండా, సిఎం రేవంత్‌ రెడ్డి దిగువన ఆంధ్రాకు విడిచి పెట్టేస్తున్నారని విమర్శించింది.

ఇక్కడ కరువు ఏర్పడిందని, అక్కడ ఏపీలో ‘క్రాప్ హాలీడే’ లేకుండా పంటలకు నీళ్ళు అందిస్తున్నారని బీఆర్ఎస్‌ ఆరోపించింది. ‘

బీఆర్ఎస్‌ పార్టీ ఇంతగా రెచ్చిపోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

1. బీఆర్ఎస్‌ పార్టీ చేసే ప్రతీ ఆరోపణకు చాలా ధీటుగా, ఘాటుగా జవాబు చెప్పే సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విషయంలో మౌనం వహిస్తుండటం.

2. నీళ్ళ పేరుతో బీఆర్ఎస్‌ చేస్తున్న ఈ రాజకీయాలలో వేలు పెడితే, ఆ పార్టీకే రాజకీయంగా మైలేజ్ లభిస్తుందనే ఆలోచనతో టీడీపి మౌనంగా ఉండిపోవడం.

తెలంగాణలో నీళ్ళు పారుతున్నప్పుడు వాటిని ఎందుకు ఎత్తిపోసుకోవడం లేదో నిర్దిష్టంగా జవాబు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే. కనుక దానినే బీఆర్ఎస్‌ గట్టిగా నిలదీసి అడగాలి. కానీ అందుకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడును నిందించడం అంటే కేసీఆర్‌ భాషలో ‘చిల్లర రాజకీయాలు’ చేయడమే.

కేసీఆర్‌ సిఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రపంచంలోనే అదొక ‘ఇంజనీరింగ్ వండర్.’ నభూతో నభవిష్యతి అని గొప్పగా చెప్పుకున్నారు. కానీ కేసీఆర్‌ కుర్చీలో నుంచి దిగక ముందే మేడిగడ్డ బారాజ్‌ క్రుంగిపోయి, బీఆర్ఎస్‌ ప్రభుత్వ అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఉంది.

కానీ చంద్రబాబు నాయుడు వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులు చకచకా పూర్తిచేస్తూ అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు నీళ్ళు పారిస్తుంటే బీఆర్ఎస్‌ పార్టీ కడుపు మండిపోతోంది.

‘యస్! తెలంగాణ మా జాగీరే’ అంటూ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసిన బీఆర్ఎస్‌ పార్టీ, ‘ఈ నీళ్ళు ఎవరి బాబు సొమ్ము?’ అని ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగించదు.

కానీ నదీ జలాలు ‘ఎవరి బాబు సొమ్మూ కావు’. ఇది దేశ సంపద. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పారుతూ అందరికీ ఉపయోగపడే ప్రకృతి వనరు ఇది.

కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ మీదుగా పారినంత మాత్రాన్న అవి ఆ రాష్ట్రం లేదా బీఆర్ఎస్‌ పార్టీ సొత్తు కాబోవు. కానీ తమ సొత్తే అనుకుంటే మహారాష్ట్రలో పుట్టిన గోదావరి ఆ రాష్ట్రం సొత్తు.. కర్ణాటకలో పుట్టిన తుంగభద్ర ఆ రాష్ట్ర సొత్తు అవుతుంది.

కానీ ఆ నీటిని దిగువనున్న తెలంగాణకు వదలబోమని ఆ రాష్ట్రాలు వాదించడం లేదు కదా? దిగువనున్న తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పడం లేదు కదా?

కానీ తెలంగాణ దిగువనున్న ఏపీలో ప్రాజెక్టులు కట్టుకుంటే బీఆర్ఎస్‌ పార్టీకి కడుపు మండిపోతోంది. ఎవరి బాబు సొమ్ము? అని ప్రశ్నించడం దాని అహంభావానికి నిదర్శనమే.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటే ఎంత గట్టిగానైనా నిలదీసుకోవచ్చు. కానీ దిగువకు పారిన నీటిని వృధా కాకుండా వాడుకుంటున్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని చూసి ఇలా అసూయతో రగిలిపోవడం దేనికి?

ADVERTISEMENT
Latest Stories