మరోసారి “ఆత్మగౌరవ” నినాదం!

TDP Nara-Chandrababu-Naiduతెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. 40 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా 1982 మార్చి 29న పార్టీ స్థాపించడం జరిగింది.

తెలుగు వారి ‘ఆత్మ గౌరవం’ అనే నినాదంతో పుట్టింది టీడీపీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటివరకు ఏకచక్రాధిపత్యంగా అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పోటీగా నిలబడి, తనను నమ్మిన నాయకులను బరిలో దింపి పార్టీ స్థాపించిన 9 నెలలోనే రాష్ట్రంలో అధికారాన్ని అందిపుచ్చుకున్నారు నందమూరి తారక రామారావు.

ADVERTISEMENT

ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు తన రాజకీయ చతురతతో పార్టీని ఎన్నో విపత్కర సందర్భాల నుండి బయటపడేసి ఈనాటి వరకు పార్టీని ప్రజలలో నిలిపారు. అందుకే రాజకీయ కురువృద్ధులు చంద్రబాబుని “రాజకీయ చాణుక్యుడు” అని ప్రశంసిస్తారు. చంద్రబాబు దేశ రాజకీయ చరిత్రలో తన కంటూ ఓ ప్రత్యేక పేజీని సృష్టించుకున్నారు.

టీడీపీ ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించినా, జాతీయ భావాలతో ముందుకెళ్తోంది. తెలుగుదేశం పార్టీ చరిత్ర నేటి తరానికి తెలిసేలా పార్టీ 40 వసంతాల వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రతి కార్యకర్త పార్టీ పునర్నిర్మాణం కోసం శ్రమించాలని, పట్టుదలతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సందేశమిచ్చారు.

తెలుగుదేశం పార్టీ ఎంతో మంది రాజకీయ ఉద్దండులని ఎదుర్కొని నిలబడిందని, పార్టీకి ‘గెలుపోటములు’ సహజమని, ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకుని పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయంటూ టీడీపీ శ్రేణులలో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని చంద్రబాబు పురిగొల్పారు.

ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ తిరిగి పురోగతిని సాధించాలన్న, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధితో కూడిన సంక్షేమ ఫలాలు అందాలన్న టీడీపీ అధికారంలో రావాలి అనే నినాదంతో కార్యకర్తలు, నాయకులు నిత్యం ప్రజలలో ఉంటూ వారిని చైతన్య పరచాలని పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన సుపరిపాలన, ఆర్ధిక భద్రత, ఆరోగ్య భరోసా, విద్య, వైద్యం, రవాణా తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండాలన్నా., తెలుగు వారి “ఆత్మ గౌరవం” నిలవాలన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడం అనివార్యమని చంద్రబాబు తెలుగుజాతిని ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చారు.

ఆనాడు ఏదైతే ఎన్టీఆర్ “ఆత్మగౌరవ” నినాదంతో కాంగ్రెస్ ను ఎదిరించి జెండా పాతారో, మళ్ళీ అదే “ఆత్మగౌరవ” నినాదాన్ని నేడు చంద్రబాబు కూడా వినిపించారు. అధికార బలం చూపిస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలువరించి, ఏపీ “ఆత్మగౌరవం” నిలపాలంటూ పార్టీ కార్యకర్తలు, నేతలతో పాటు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ADVERTISEMENT
Latest Stories