ఎన్నికలలో గెలుపోటములు సహజం. కనుక ఓడిన పార్టీ తమని ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మవిమర్శ చేసుకొని లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాలి. ఆదేవిదంగా ఎన్నికలలో గెలిచిన పార్టీ ప్రజలు తమ ప్రత్యర్ధి పార్టీని కాదని తమని ఎందుకు గెలిపించారో మరిచిపోకూడదు.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం చేయకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. అధికార, ప్రతిపక్షాలు ఈవిదంగా ముందుకు సాగితే రాజకీయాలు ‘పరిశుభ్రంగా’ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ప్రజలు కూడా అసహ్యించుకునే స్థాయికి పడిపోతున్నాయి.
రాజకీయ పార్టీలు ప్రవేశించక ముందు సోషల్ మీడియా ‘పరిశుభ్రంగా’ ఉండేది. కానీ ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడం కోసమే సోషల్ మీడియాని వాడుకొంటున్నారు.
ఏపీ, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడిన 11 ఏళ్ళలోనే రెండు రాష్ట్రాలలో రాజకీయాలు ఇంత నీచమైన స్థితికి ఎందుకు దిగజారిపోయాయి?అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ వైసీపీ రెండూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా ప్రతిపక్షాలను తుడిచిపెట్టేసి ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలనుకోవడం వల్లనే!
2014-19లో తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్, రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలను తుడిచిపెట్టేయాలని ప్రయత్నించారు. 2019-23లో రాష్ట్రంలో ప్రతిపక్షాల పట్ల మరింత నిర్ధయగా వ్యవహరించారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలను కోవడం లేదు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, రేసింగ్ కేసులపై చట్ట బద్దంగా విచారణ జరిపిస్తున్నారు అంతే! ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ ఈపాటికి జైల్లో ఉండేవారు కదా?
ఏపీలో 2014-19లోముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు వైసీపీ, జగన్ జోలికి అసలు వెళ్ళలేదు. కానీ జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నేతలను, కార్యకర్తలను చాలా వేధించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ నేతలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఎందువల్ల?
అంటే అధికారంలో ఉన్నప్పుడు తాము వారిపట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించామని, అందుకు వారు తమపై ప్రతీకారం తీర్చుకుంటారని వైసీపీ నేతలకు తెలుసు కనుకనే!
కానీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డిలాగే ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు. వైసీపీ చేసిన తప్పులపై విచారణ జరిపిస్తున్నారంతే!లేకుంటే జగన్, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు ఇంతకాలం బయట ఉండగలిగేవారా?అంటే కానే కాదు.
కనుక అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు నాయుడు తమతో చట్ట ప్రకారమే వ్యవహరిస్తుండటంతో, ఆ చట్టాన్ని ఏవిదంగా ఎదుర్కోవాలో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలకు బాగా తెలుసు కనుక వారి కంటికి ఇరువురూ ముఖ్యమంత్రులు చాలా అలుసుగా కనిపిస్తున్నారు.
అందుకే ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్ నేతలు ఇంతగా రెచ్చిపోతున్నారని చెప్పక తప్పదు. అంతే కాదు.. మళ్ళీ తాము అధికారంలోకి వస్తే ప్రతీకార చర్యలు తప్పవని పదేపదే బెదిరిస్తున్నారు కూడా.
కనుక ఆ రెండు పార్టీలు గెలిచి అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాయో చెప్పేశాయి. కనుక వాటిని ఎన్నుకోవాలో వద్దో, అటువంటి ప్రతీకార రాజకీయాలు భరించాల్సిన అవసరం ఉందా? అని ప్రజలే ఆలోచించుకోవాలి.
అలాగే అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కూటమి ప్రభుత్వం తాము ఓడిపోతే తమ పరిస్థితి ఏవిదంగా ఉంటుందో ఇప్పుడే అర్దమవుతోంది కనుక ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావలనే ఏకైక లక్ష్యంతో పని చేయాలి. లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధివ నిలిచిపోయి రాక్షస రాజకీయ క్రీడలు సాగుతుంటాయి.




