ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపి ఘోరపరాజయం పాలవగా, టిడిపి కూటమి ప్రభుత్వం చాలా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఈ రాజకీయ మార్పు జరిగి అప్పుడే 4 నెలలవుతోంది. కనుక త్వరలో జరుగబోయే రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు తీవ్ర పరాభవం పొందిన వైసీపికి, ప్రజలు తమవైపే ఉన్నారని విజయోత్సాహం ఉన్న టిడిపికి మరో అగ్నిపరీక్షగా నిలువబోతున్నాయి.
రాష్ట్రంలో రాజకీయాలకు కేంద్రంగా, అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాలలో పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగబోతున్నాయి.
టిడిపి అభ్యర్ధులుగా ఉభయ గోదావరి జిల్లాలకు పెరాబత్తుల రాజశేఖర్, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌లు బరిలో దిగుతున్నారు.
వైసీపి ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల అభ్యర్ధిగా గౌతమ్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. మరొక అభ్యర్ధిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.
శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించడం వలనే తాము ఓడిపోయామని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. హర్యానా ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించడం వలనే బీజేపీ గెలవగలిగిందని జగన్ ట్వీట్ చేశారు. కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు దేశంలో మళ్ళీ బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించడంపై అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని ట్వీట్ చేశారు.
జగన్ కోరుకున్నట్లుగా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలోనే జరుగబోతున్నాయి. కనుక ఈ ఎన్నికలలో వైసీపి ఇద్దరు అభ్యర్ధులు ఘన విజయం సాధించి తీరాలి. లేకుంటే జగన్ వాదనలు అర్దరహితమని, శాసనసభ ఎన్నికలలో తన ఓటమి, వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే ఈవీఎంలను తప్పు పట్టారని భావించాల్సి ఉంటుంది.
ఈ ఎన్నికలలో ఓటర్లు అందరూ పట్టభద్రులు. కనుక టిడిపి కూటమి ప్రభుత్వం నాలుగు నెలల పాలనకు ఈ పట్టభద్ర ఎన్నికలు రిఫరెండంగా భావించవచ్చు. కనుక రెండు పార్టీలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివే అని చెప్పవచ్చు.




