చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో అమరావతి, పోలవరం మొదలు అన్నా క్యాంటీన్ల వరకు ఆయన మొదలుపెట్టిన ప్రతీ పనిని జగన్ నిలిపివేశారు. ఆయన వ్యక్తిగత కక్ష, ద్వేషానికి యావత్ రాష్ట్రానికి తీరని నష్టం కలిగించడానికి వెనకాడలేదు.
నేటికీ ఆయన అదే విదానంతో ముందుకు సాగుతున్నారు తప్ప తన ధోరణిలో తప్పొప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అందుకు ఆయనకు అహం అడ్డొస్తోంది. ఆ ఆహానికి వైసీపీ ఇంకా బలైపోతూనే ఉంది. అది ఆ పార్టీ సమస్య. దాంతో రాష్ట్ర ప్రజానీకానికి ఏం సంబందం లేదు.
జగన్ వలన టీడీపీ నేతలు, కార్యకర్తలు, వారి అధినేత చంద్రబాబు నాయుడు కూడా నానా కష్టాలు అనుభవించారు కనుక ఇప్పుడు కావాలనుకుంటే ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ తమకు అటువంటి ఆలోచన లేదని, రాజకీయాలలో అది మంచి పద్దతి కాదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ చాలా స్పష్టంగా చెపుతున్నారు.
జగన్‌లాగే చంద్రబాబు నాయుడు కూడా వ్యవహరిస్తూ, ఆయన హయాంలో మొదలుపెట్టిన పనులన్నిటినీ నిలిపి వేయొచ్చు. కానీ ‘అలా చేస్తే మాకూ జగన్‌కీ తేడా ఏముంటుంది?’ అనే సిఎం చంద్రబాబు నాయుడు ప్రశ్న ఆలోచింపజేస్తుంది.
అందుకే ప్రభుత్వానికి అనవసరమనుకున్నవాలంటీర్లను పక్కన పెట్టి, సచివాలయ వ్యవస్థని మాత్రం కొనసాగిస్తున్నారు. దానిని మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ప్రతీ పట్టణం, గ్రామంలో జనాభాకు తగ్గట్లుగా సచివాలయ సిబ్బంది సర్దుబాటు చేసి, వారిని టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందిగా విభజించాలని నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు మరింత వేగవంతం చేశారు. అలాగే విశాఖలో జగన్ శంకుస్థాపన చేసిన ఇనాఆర్బిట్ షాపింగ్ మాల్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది తప్ప జగన్ మొదలుపెట్టారని వాటిని నిలిపివేయాలనుకోలేదు.
కానీ జగన్ చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే తన విధానంగా మార్చేసుకొని చివరికి సొంత పార్టీకి కూడా తీవ్రంగా నష్టం కలిగించుకున్నారు. రాష్ట్రాభివృద్ధి ఉపయోగపడుతుందనుకున్నప్పుడు అవి తమ రాజకీయ శత్రువు మొదలుపెట్టినా స్వీకరించి, కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు వెనకడుగు వేయలేదు. సిఎం చంద్రబాబు నాయుడుకి, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డికి ఇదే తేడా!




