ఆ స్వరం ఒక్క నారాయణ మూర్తిదే కాదు!

That voice is not just R Narayana Murthy Alone

సినీ పరిశ్రమలో ఆర్‌ నారాయణ మూర్తి ఓ ఎర్రెర్రని జండా వంటివారు. ఆయన మాట, పాట, సినిమాలలో విప్లవభావాలు కంపించినా సాధారణంగా ఆయన ఎవరి జోలికి పోరు. వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ తొలిసారిగా థియేటర్స్ బంద్ విషయంలో ఏపీ ప్రభుత్వం, అప్‌డేట్‌ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ తీరుని తప్పు పడుతూ విమర్శించారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో సినీ పరిశ్రమకి దేవాలయాల వంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిర్వహణ ఖర్చులు భరించలేక మూతపడుతుంటే చాలా బాధ కలుగుతోందన్నారు.

ADVERTISEMENT

ఆ మిగిలిన థియేటర్స్ కాపాడుకోవడం కోసం వాటి యజమానులు పర్సంటేజ్ విధానం అమలు చేయాలని కోరుతూ బంద్‌కు పిలుపునిస్తే, దానిని హరిహర వీరమల్లు సినిమాతో ముడిపెట్టి మాట్లాడటం, వారి సమస్యని పక్కన పెట్టి రాజకీయాలు చేయడం సరికాదని నారాయణ మూర్తి అన్నారు.

పవన్ కళ్యాణ్‌ తన హరిహర వీరమల్లు గురించి మాట్లాడకుండా, ఈ సమస్యపై చర్చలకు రమ్మనమని సినీ పరిశ్రమలో వారిని ఆహ్వానించి ఉండి ఉంటే హుందాగా ఉండేదని అన్నారు.

పవన్ కళ్యాణ్‌ సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలలోకి వెళ్ళి రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది కానీ రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత సినీ పరిశ్రమ పట్ల ఈవిదంగా వ్యవహరించడం తగదని నారాయణ మూర్తి అన్నారు.

సినీ పరిశ్రమ పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నామని ప్రభుత్వాధినేతలు, మంత్రులు చెప్పుకొంటున్నప్పటికీ, వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి సినీ పరిశ్రమ మనుగడ సాగిస్తోందనేది వాస్తవం. కనుక ఎవరూ ధైర్యం చేసి తమ అభిప్రాయాలను చెప్పలేక ‘మీరెలా అంటే అలా..’ అన్నట్లు వ్యవహరిస్తుంటారు.

థియేటర్స్ బంద్ విషయంలో పవన్ కళ్యాణ్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు కూడా సినీ ప్రముఖులు అలాగే ప్రవర్తించారు.

రాజకీయాలపై చాలా నిష్కర్షగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసే సినీ పరిశ్రమలోని ప్రకాష్ రాజ్, రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి వంటి వారు కూడా థియేటర్స్ బంద్ విషయంలో మౌనంగా ఉండిపోయారు.

కానీ అంత మాత్రాన్న సినీ పరిశ్రమలో వారికి వేరే అభిప్రాయాలు ఉండవని కాదు. తమ మనుగడ ప్రభుత్వంపై ఆధారపడి ఉంది కనుక సర్దుకుపోతున్నారనుకోవాలి అంతే!

కనుక సినీ పరిశ్రమలో మూగబోయిన ఆ గొంతుల తరపున ఆర్‌ నారాయణ మూర్తి కంఠం కంగుమంది. కనుక అది ఆయన ఒక్కరి స్వరం.. అభిప్రాయం మాత్రమే కాదు.

పవన్ కళ్యాణ్‌ అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్నారు. కనుక నారాయణ మూర్తి విమర్శలను సానుకూలంగా స్వీకరించి థియేటర్స్ యాజమానులు ఎదుర్కొంటున్న సమస్యలని ఇదే అదునుగా శాశ్వితంగా పరిష్కరించగలిగితే, సినీ పరిశ్రమలో వారు, సినీ అభిమానులు, సామాన్య ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు.

ADVERTISEMENT
Latest Stories