లోకేష్ నిలబడాలి..! నిలపెట్టాలి..!

Nara Lokeshచంద్రబాబు అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలను లోకేష్ ముందుండి నడపాల్సి అవసరం – అవకాశం రెండు వచ్చాయి. వారసత్వం అడుగులలో రాజకీయాలలోకి వచ్చిన లోకేష్ కి తనను తానూ నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం గా భావించాలి. ఒక చెడులోను మంచిని వెతకడమే రాజకీయాలలో ధర్మ నీతి.

లోకేష్ తండ్రి అరెస్ట్ తో కుంగిపోకుండా..,కుటుంబాన్ని,పార్టీని,పార్టీ క్యాడర్ ని సమన్వయ పరుచుకుంటూ ప్రజలలోకి వెళ్లాల్సిన సమయం ఇది. పార్టీ నేతలకు నేనున్నాను అనే భరోసా కలిపించుకుంటూ.., వైసీపీ నేతల రాజకీయ విమర్శలకు ధీటైనా సమాధానం చెప్తూ తనూ ఒక రియల్ టైం ప్రజా నాయకుడిగా ఎదగడానికి మంచి అవకాశం ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ADVERTISEMENT

ఇప్పటికే లోకేష్ యువగళం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ., ఆ సమస్యల పై స్పందిస్తూ, తనదైన స్టైల్ లో ముందుకెళ్తున్నారు. గత ఎన్నికలలో కూడా పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాలను వదిలి దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని మంగళగిరి లాంటి నియోజక వర్గంలో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఒడిన చోటే గెలుస్తాను.., పార్టీని గెలిపిస్తాను అంటూ పడ్డదగ్గరే నిలబడ్డారు.

ఒక రాజకీయ నాయకుడి నాయకత్వ లక్షణాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు.,ఆపార్టీ సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కున్నప్పుడే బయటకొస్తాయి అనేది రాజకీయాలలో ఉన్న నానుడి. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. చంద్రబాబు హయాంలో కూడా పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకెళ్ళింది అనటం కంటే కూడా బాబు తన రాజకీయ చాణుక్యం తో ముందుకి తీసుకెళ్లారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

పార్టీ నే కాదు.., రాష్ట్రాన్ని కూడా ఇటువంటి సంక్షోభాల నుంచి బయటపడేసిన ఘనత చంద్రబాబుకి ఉంది. ప్రతిపక్షం లో ఉన్నప్పుడే పట్టుదల, ఓర్పు, ప్రజా పోరాటాలు చేస్తూ, పార్టీ పట్ల, పార్టీ కార్యకర్తల పట్ల అంకిత భావంతో ఉంటూ ఇన్నాళ్లు పార్టీని ముందుకి తీసుకువెళ్లిన బాబు కి తగ్గ వారసుడిగా లోకేష్ ఇప్పుడు తన స్థానాన్ని నిలుపుకోవాల్సి సమయం ఆసన్నమైంది.

నిండు శాసనసభలో తన తల్లిని అవమానించారు..,సుదీర్ఘ రాజకీయ ప్రయాణం లో ఎన్నడూ చూడని అవమానాలను తన తండ్రిని తాకాయి. వాటన్నికి తట్టుకొని లోకేష్.. తానూ నిలబడాలి..! పార్టీని నిలపెట్టాలి..!

ADVERTISEMENT
Latest Stories