తిరుపతిలో తొక్కిసలాట: ఎవరు బాధ్యులు?

tirupati-stampede

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈరోజు (గురువారం) ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్స్ జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. దీని కోసం తిరుపతిలో టీటీడీ 8 కౌంటర్లు ఏర్పాటు చేసింది.

వాటిలో ఒకటి బైరాగి పట్టెడ. నిన్న ఉదయం నుంచే వేలాదిమంది భక్తులు అక్కడకు చేరుకొని పక్కనే ఉన్న పార్కులో ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT

ఓ వ్యక్తి అస్వస్థతకు గురవడంతో అతనిని ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు కొద్దిగా గేట్లు తీయడంతో క్యూలైన్లలో ప్రవేశించేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించి కొందరు లోనికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు.

ఆ తొక్కిసలాటలో ఐదుగురు భక్తులు మరణించారు. మరో 48 మంది గాయపడ్డారు. పోలీసులు వారిని తిరుపతిలోని రుయా, స్విమ్స్ హాస్పిటల్స్‌కు తరలించారు.

వైకుంఠ ద్వార దర్శనాలకు లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీకి, జిల్లా అధికారులకు బాగా తెలుసు. ఒకవేళ తెలియకపోయినా నిన్న ఉదయం నుంచే తిరుపతి పట్టణంలో నిండిపోయిన లక్షలాది భక్తులను చూసినా పరిస్థితి అంచనా వేసి అందుకు తగిన్నట్లు భారీగా పోలీసులను మోహరించవచ్చు.

తొక్కిసలాట జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయవచ్చు. చేశారు కూడా. కానీ అంత మందిని నియంత్రించడానికి సరిపడా ఏర్పాట్లు చేయలేడని తొక్కిసలాటతో స్పష్టం అయ్యింది.

నిత్యం వేలమంది భక్తులకు టీటీడీ ఉచిత దర్శనం టికెట్స్ కౌంటర్స్ ద్వారానే జారీ చేస్తుంటుంది. లక్షల మందిని నియంత్రించగల సామర్ధ్యం టీటీడీకి ఉంది.

కనుకనే ఎన్నడూ కౌంటర్ల వద్ద, తిరుమల క్యూ లైన్లలో తొక్కిసలాటలు జరిగిన దాఖలాలు లేవు. కానీ వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్స్ జారీ చేయక మునుపే తొక్కిసలాట జరిగింది.

బుధవారం ఉదయం నుంచే తిరుపతి పట్టణంలో లక్షల మంది పడిగాపులు కాస్తున్నప్పుడు టీటీడీ పరిస్థితిని అంచనా వేసి అందుకు తగిన్నట్లు మరిన్ని ఏర్పాట్లు చేయవచ్చు. కానీ చేయకపోవడం వలననే తొక్కిసలాట జరిగిందని స్పష్టమవుతోంది.

వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందనే భక్తుల నమ్మకాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ ఈవిదంగా జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఆలోచించడం కూడా చాలా అవసరమే.

పుణ్యం కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరమా? అని ఆలోచించి ఉంటే ఈ విషాద ఘటన జరిగి ఉండేదే కాదు. కనుక ఈ ఘటనకు ఎవరు బాధ్యులు? అంటే అందరూ అని అర్దమవుతూనే ఉంది.

కానీ తొక్కిసలాట జరిగింది. ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇందుకు ఎవరైనా బాధపడతారు. కానీ శవ రాజకీయాలు చేసేందుకు మరో అవకాశం లభించిందని వైసీపీ సొంత మీడియాలో అప్పుడే దుష్ప్రచారం మొదలుపెట్టేసింది.

ఈ ఘటనతో సిఎం చంద్రబాబు నాయుడుకి ప్రత్యక్షంగా సంబందం లేనప్పటికీ ఆయన వల్లనే తొక్కిసలాట జరిగిందని, మనుషులు చనిపోయారని, అదే జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలా జరిగేదే కాదని వైసీపీ సొంత మీడియాలో అప్పుడే ఓ స్టోరీ వేసేసింది. కనుక ఈ విషాద ఘటనపై రాజకీయాలను ఆపలేము.

ADVERTISEMENT
Latest Stories