ఈ రోజులలో భయమే బాధ్యతను గుర్తుచేస్తుంది. బెదిరింపే మాట వినేలా చేసి దారిలో పెడుతుంది. ఇటువంటి ఉదాహరణే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులకు సరిగ్గా సరిపోయేలా ఉంది. గత ఐదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ టాలీవుడ్ దిగ్గజాలను భయపెట్టి బెదించి సినీ పరిశ్రమను తన అదుపులోకి తెచ్చుకుంది.
ఏపీలో సినిమా విడుదల చేయాలి అంటే భారీ బడ్జెట్ సినిమా అయినా, పాన్ ఇండియా మూవీ అయిన సరే జగన్ చెప్పిందే రేటు, వైసీపీ చేసిందే చట్టం అన్నట్టుగా సాగింది. అలాగే ఇండస్ట్రీ పెద్దల మీద కూడా వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు, సీఎంగా జగన్ ప్రవర్తించిన తీరు టాలీవుడ్ దీన స్థితిని భయట ప్రపంచానికి తెలియచెప్పింది.
Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?
అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం కానీ, వ్యతిరేకించే ధైర్యం కానీ చెయ్యలేకపోయింది టాలీవుడ్. ఇక తెలంగాణలో అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ బేషరతు మద్దతు ఇచ్చినట్టే నడుచుకుంది. టాలీవుడ్ ను తమ గ్రిప్ లోకి తెచ్చుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి ప్రాంతీయతను ప్రధాన అస్త్రంగా ఎంచుకుంటే, ఇక ఆ తరువాత ఎదురైనా డ్రగ్స్ కేసులు టాలీవుడ్ నోటికి తాళం వేసాయి.
ఇక తెలంగాణలో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు అవసరమైన అదనపు బెనిఫిట్స్ ని టాలీవుడ్ అందుకోవాలి అంటే సినిమా విడుదలకు ముందు ఆ సినిమాలో నటించిన నటీనటులు డ్రగ్స్ రహిత తెలంగాణకు తమ వంతు బాధ్యతగా వీడియో చెయ్యాల్సిందే అనే డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు.
Also Read – బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ‘అన్-స్టాపబుల్’..!
ఇలా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా ఆచరించిన హీరోల సినిమాలకు మాత్రమే ప్రభుత్వం నుండి అందవలసిన అదనపు ఆకర్షణలు అందుతాయంటూ షరతు విధించింది. దీనితో ప్రముఖ స్టార్స్ సైతం తమ సినిమా విడుదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు తగ్గట్టుగా డ్రగ్స్ రహిత తెలంగాణ పేరిట ఒక వీడియో బైట్ విడుదల చేస్తున్నారు.
ఇందుకు గాను దేవర మూవీ కి ఎన్టీఆర్, కల్కి సినిమాకు ప్రభాస్, పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్…ఇలా ఇండస్ట్రీ టాప్ హీరోస్ అందరు కూడా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి, రేవంత్ ఆదేశాలను అనుసరిస్తున్నారు. మరి ఏపీలో కూడా ఇదే తరహా విధానాన్ని ఈ స్టార్స్ అనుసరిస్తున్నారా.? అంటే లేదనే చెప్పాలి. అంటే కూటమి ప్రభుత్వ మంచితనాన్ని, బాబు ఉదారతను సినీ ఇండస్ట్రీ అలుసుగా తీసుకుంటుందా.?
Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!
ఇక సంధ్యా థియేటర్ ఘటనతో ఈ రూల్ ‘రేవంత్ గారి రూల్’ ఆచరించక తప్పదు అంటూ తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ పీకమీద కత్తిపెట్టింది. అంటే ఇక్కడ సినీ ప్రముఖుల మీద మొట్టికాయలు వేసిన ప్రభుత్వాలకు, సినీ పరిశ్రమకు డిమాండ్ల తో కూడిన ఆదేశాలు ఇచ్చే ప్రభుత్వాలకు మాత్రమే ఈ సెలబ్రేటిస్ తలవంచుతున్నారు, ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వీడియో చేస్తే కానీ సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదు అంటే వీడియో చేస్తున్నారు, వైసీపీ నాకు నచ్చిన సినిమాకు మాత్రమే టికెట్ రేట్లు పెంచుతాను అంటూ ఖరాకండిగా తేల్చేసినా చేసేదేమి లేదంటూ చేతులు కట్టుకున్నారు, బిఆర్ఎస్ డ్రగ్స్ కేసును అడ్డుపెట్టుకుని సినీ పరిశ్రమను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్న మౌనంగానే తలవంచారు.
కానీ ఏపీలో ప్రభుత్వంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ ఏనాడు సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది లేదు. అలా అని సినీ ప్రముఖులను ఇబ్బందిపెట్టేలా తమ ప్రభుత్వానికి సహకరించాలి అంటూ డిమాండ్లు చేసింది లేదు. ఇక తాము చెప్పిందే చట్టం, తమ ప్రభుత్వం నిర్ణయించేది రేటు అనేలా కాకుండా ఇండస్ట్రీ పెద్దల నిర్ణయానికి ఆమోదం ముద్ర వేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా బాబు సినీ పరిశ్రమ కోసం ఇంతలా వెసులుబాటులు కలిపిస్తున్నప్పటికీ ఏపీ కోసం కానీ ఇక్కడ ప్రజల బాగు కోసం కానీ ఇండస్ట్రీ ప్రముఖులు చేసిందేమిటి.? ఇది వారి కనీస బాధ్యత కిందా ఏపీ గవర్నమెంట్ కు కూడా తెలంగాణ మాదిరి ఒక్క వీడియో బైట్ ఇవ్వడానికి సినీ స్టార్స్ ఎవ్వరు ముందుకు రావడం లేదు ఎందుకు? అంటే ఇక్కడ మొట్టికాయలకు, బెదింపులకు మాత్రమే పని జరుగుతుంది కానీ మంచితనానికి కాదన్నమాట.