ఫాక్షన్ అనేది రాయలసీమ ప్రాంత జీవనాన్ని ఎంత చిద్రం చేసిందో చేసిందో ఇప్పటికీ దేశంలో వెనకబడిన ప్రాంతాలలో ఒకటైన సీమలో చెట్టు, చేమా, రాయి, రప్పా, ఇలా దేనినడిగినా చెబుతాయి. హంపి చక్రవర్తులు, నిజాం నవాబులకు ఊడిగం చేసి చిన్న చిన్న పల్లెల్లో పెత్తనం సాదించుకుని తర్వాత ప్రజల రక్తం తాగి పాలెగాళ్ళుగా మారిన వాళ్ళ అరాచకాలు బ్రిటీష్ అధికారి థామస్ మన్రో వచ్చి అణచివేసే వరకు అడ్డులేకుండా కొనసాగాయి. తర్వాత కొంత తగ్గినా, స్వాతంత్ర్యం వచ్చాక ప్రజాస్వామ్యం మాటున రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత మళ్ళీ విజృంభించారు. దాదాపు 90వ దశకం మద్య వరకు కొనసాగిన ఆ పాలెగాళ్ళ దొరతనం అప్పటి ప్రభుత్వం మరోసారి సమర్దులైన అధికారుల అండతో అణచినా, తరువాత కాలంలో పాలెగాళ్ళే అధికారం చేపట్టాక అన్ని వ్యవస్థల్లో దూరి, తమకు నచ్చని వారిని, తమ తప్పులు ఎత్తి చూపిన వారిని రకరకాలుగా వేధింపులకు గురిచేస్తూ, ఆయా కుటుంబాల్లో మహిళలను అవమానిస్తూ కాలకేయుల్లా మారారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని అక్రమ కేసులో అరెస్టు చేసాక ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఆ పార్టీ అభిమానులే కాక, తటస్థులు, అధికార పార్టీ అభిమానుల్లో కూడా కొంత మంది ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు తమకు చేతనైనంతలో వాటికి మద్దతు తెలుపుతున్నారు. ప్రజల్లో ఈ ఊహించని నిరసనలు, సానుభూతి అధికార పార్టీ నాయకులనే కాదు, వారి కార్యకర్తలకు కూడా అసహనాన్ని, భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఎంతగా అంటే చివరకు విశాల సముద్రతీరంలో కూడా ఆంక్షలు పెట్టి కేసులు పెట్టి అరెస్టులు చేసే అంతగా.
అన్నీ ఆ దుంప మెుక్కలే అన్నట్టు తరువాత ఆ పార్టీ కార్యకర్తల వంతు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన జెనెక్స్ అనే ఒక కారు సర్వీస్ సంస్ధ ఓనర్ మాజీ ముఖ్యమంత్రిని అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఆయన చేసిన అభివృద్ధి వల్లే తన లాంటి వేల మందికి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు లభించాయని, అటువంటి అభివృద్ది కాంక్షించే నాయకుడిని అక్రమ కేసులో అరెస్టు చెయ్యడంపై అసంతృప్తితో నిరసిస్తూ ఇకపై తమ సంస్థలో అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులకు సేవలు అందించను అని ఒక బోర్డు పెట్టారు. నిజానికి వ్యాపారస్థులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యాపారంలో చూపించడానికి చాలా భయపడతారు, ఎందుకంటే జీవితం మెుత్తం వ్యాపారంలో పెట్టి, రేయింబవళ్ళూ కష్టపడి జీవనం సాగిస్తూ మరో నలుగురికి ఉపాధి కలిపిస్తూ ఉండే వారు వ్యక్తి గత అభిప్రాయాల వల్ల వ్యాపారాలను కోల్పోతామనే భయం వల్ల వారు తమ అభిప్రాయాలు బహిరింగపరచరు. దేశంలో పెద్ద వ్యాపార సామ్రాజ్యాలున్న అంబానీ, అదానీల నుండి వీధి చివర కిరాణా అంగడి వ్యాపారి వరకు వ్యక్తిగత అభిప్రాయాల విషయంలో గుంభనంగా ఉంటారు. కానీ జీవితంలో మరెన్నో సాధించగలిగే అవకాశం ఉండీ తన అభిప్రాయం బహిరంగంగా తెలియపరిచి ప్రజాస్వామ్య స్పూర్తిని నిలబెట్టిన యువకుడిని నిజంగా అభినందించాలి. అతని అభిప్రాయాలు తప్పైతే వ్యకిరేకించాలి, లేదంటే అతను చెప్పిన పద్దతిలో వీళ్ళు కూడా మేం మీ సేవలు తీసుకోం అని చెప్పాలి. కానీ ప్రత్యర్థి ఆర్ధిక మూలాలు దెబ్బతీసే పద్దతులు, ప్రత్యర్థుల తోటలు నరికి, పంటలు తగలబెట్టే ఫాక్షన్ లక్షణాలు నరనరానా జీర్ణించుకున్న అధికార పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు వందల్లో వచ్చి ఆ సంస్థపై ఆన్ లైన్ లో తప్పుడు రివ్యూలతో చెడు ప్రచారాలు మెుదలు పెట్టారు. వీరిలో 90% ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఉండటం విశేషం. ఈరోజు ఏదైనా కొనాలన్నా, ఏ సేవైనా పొందాలన్నా ముందు ఆన్ లైన్ లో రివ్యూలను చూస్తారు. అటువంటి చోట తప్పుడు రివ్యూలతో ఆ సంస్ధ ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టాలనుకునే ఫాక్షన్ పద్దతులను అందరూ వ్యతిరేకించారు. కొందరు ఆ సంస్థకు మద్దతుగా కూడా రివ్యూలను ఇచ్చారు.
ప్రజాస్వామ్యంలో తప్పైనా, ఒప్పైనా అభిప్రాయం తెలపడం అనేది ప్రాధమిక సూత్రం. దానితో విభేదిస్తే ఆ విషయం చర్చించాలి. చర్చలే ప్రజాస్వామ్యానికి మూలసూత్రం. అంతేగానీ ఈ పాలెగాళ్ళ పద్దతులలో ఫాక్షన్ విధానాలతో ఈ డిజిటల్ యుగంలో కూడా అనాగరికమైన పనులు చేయకుండా, ప్రజాస్వామ్య స్పూర్తిని మరో శతాబ్దానికైనా వీరు వంటబట్టించుకుంటారో లేదో కాలమే నిర్ణయించాలి.



