ఏపీలో డొక్కు బస్సులు… తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సులు

TSRTCఆంధ్రా, తెలంగాణలతో పాటు ఆర్టీసీ కూడా రెండుగా విడిపోయినప్పుడు, టీఎస్‌ఆర్టీసీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. ఆ పరిస్థితులలో టీఎస్‌ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేశారు. అప్పుడు తెలంగాణ సిఎం కేసీఆర్‌ టీఎస్‌ఆర్టీసీని మూసేసేందుకు సిద్దపడారు. చివరకి విధిలేని పరిస్థితులలో కార్మికులే సమ్మె విరమించి కేసీఆర్‌ షరతులన్నిటికీ ఒప్పుకొని డ్యూటీలలో చేరారు.

ADVERTISEMENT

ఆ తర్వాత టీఎస్‌ఆర్టీసీ పరిస్థితి మరింత దిగజారింది. నష్టాలు తగ్గించుకోవడానికి ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే దాదాపు 1,200 బస్సులను రద్దు చేశారు. ఒకానొక దశలో టీఎస్‌ఆర్టీసీ మూతపడటం ఖాయమనిపించింది.

ఆ సమయంలో టీఎస్‌ఆర్టీసీతో పోలిస్తే ఏపీఎస్ ఆర్టీసీ పరిస్థితి కాస్త మెరుగుగానే ఉండేది. చంద్రబాబు నాయుడు దానిని ఆదుకొనేందుకు అన్ని చర్యలు తీసుకొన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులందరినీ రవాణాశాఖలో విలీనం చేయడంతో వారు ఒడ్డున పడ్డారు. కానీ ఏపీఎస్ ఆర్టీసీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు.

అప్పటికే శిధిలావస్థకు చేరుకొన్న డొక్కు బస్సులు గుంతలు పడిన రోడ్లలో ప్రయాణిస్తుండటం వలన తరచూ మరమత్తులు చేయవలసి రావడం, డీజిల్, విడిభాగాల ధరలు పెరగడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వంటి అనేక కారణాల వలన ఏపీఎస్ ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా మారింది.

అయితే ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీకి వీసి సజ్జనార్‌ వంటి సమర్ధుడైన అధికారిని ఎండీగా నియమించడంతో, క్రమంగా దాని పరిస్థితిలో మార్పు మొదలైంది. టీఎస్‌ఆర్టీసీ లాభాలబాట పట్టనప్పటికీ నష్టాలను తగ్గించుకొనేందుకు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంది.

పాత డొక్కు బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ఆర్టీసీ ఆదాయం పెంచుకొనేందుకు పాత బస్సులనే కార్గో బస్సులుగా మార్చేసుకొంది. ఇటీవలే హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను కూడా ప్రవేశపెట్టింది. అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర సర్వీసుల కోసం స్లీపర్ బస్సులను కొనుగోలు చేసింది. సుమారు మరో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ పెట్టింది.

ఏపీఎస్ ఆర్టీసీపై కార్మికుల జీతాల భారం లేకపోగా ఎప్పటికప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూనే ఉంది. అయినప్పటికీ, సొంతంగా కొత్త బస్సులు కొనుగోలు చేయలేకపోతోంది. కనుక అద్దె ప్రాతిపదికన వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోబోతోంది.

పాలకుల అనాలోచిత విధానాలు, నిర్ణయాల వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంతో అభివృద్ధిలో పోటీ పడలేక చేతులెత్తేసింది. కానీ ఏపీఎస్ ఆర్టీసీకి ఏమైంది?దానికీ రాజకీయ చీడ పట్టిందా?

ADVERTISEMENT
Latest Stories