టీఎస్‌ఆర్టీసీ బిల్లులో ప్లాన్-ఏ, ప్లాన్-బి… గెలిచేది కేసీఆరే!

TSRTC Employees Protests తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం ఇంతకాలం దాచి ఉంచిన అస్త్రశస్త్రాలను సిఎం కేసీఆర్‌ బయటకు తీసి ప్రయోగిస్తున్నారు. వాటిలో టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ఒకటి.

2019లో 52 రోజుల పాటు టీఎస్‌ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఇదే కేసీఆర్‌ వారిపట్ల ఎంత కటినంగా, నిర్దయగా వ్యవహరించారో బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. సమ్మె కొనసాగిస్తే టీఎస్‌ఆర్టీసీని మూసివేస్తానని, అప్పుడు కార్మికులు అందరూ రోడ్లపై అడుక్కుతినాల్సి వస్తుందంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు. కార్మికులు అందరూ బేషరతుగా సమ్మె విరమించి విధులలో చేరకపోతే అందరూ ‘సెల్ఫ్ డిస్‌మిస్’ అయిన్నట్లు పరిగణిస్తామని హెచ్చరించారు.

ADVERTISEMENT

దాదాపు రెండు నెలల పాటు సమ్మె కొనసాగడంతో టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు నానా కష్టాలు పడ్డారు. కొందరు కార్మికులు నిరాశనిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకోగా మరికొందరు గుండెపోటుతో మరణించారు. సుమారు 35 మంది కార్మికులు సమ్మె సమయంలో మరణించారు. అయినప్పటికీ కేసీఆర్‌ మనసు కరుగలేదు.

బేషరతుగా సమ్మె విరమించాల్సిందే తప్ప వారి ఒక్క డిమాండ్‌కు కూడా తలోగ్గేది లేదని తేల్చిచెప్పారు. కార్మికుల కుటుంబాల పరిస్థితి నానాటికీ దయనీయంగా మారడంతో గత్యంతరం లేక బేషరతుగా సమ్మె విరమించి విధులలో చేరారు. ఆ తర్వాత నుంచి టీఎస్‌ఆర్టీసీలో యూనియన్లు ఉండరాదని కేసీఆర్‌ నిషేధం విధించి కార్మికుల హక్కులను కూడా కాలరాశారు.

అదే కేసీఆర్‌… ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 43 వేలమంది ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా పరిగణించాలని నిర్ణయించడంతో వారు ఆయనను దేవుడిలా భావిస్తున్నారు!తనను అసహ్యించుకొన్న వారిచేతే పాలాభిషేకాలు చేయించుకోగల నేర్పు గల కేసీఆర్‌కు ఈ బిల్లు చాలా చిన్న ఉపాయమే అని చెపొచ్చు.

ఆగస్ట్ 3 నుంచి 6వరకు మూడు రోజులు మాత్రమే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కనుక రెండురోజుల ముందు ఆ బిల్లుని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. ఆమె బిల్లుని పరిశీలించేందుకు తగినంత సమయం ఇవ్వకుండా ఆమోదముద్ర వేయించుకోవాలనుకొంది. ఒకవేళ ఆమోదముద్ర వేస్తే ఈరోజే శాసనసభలో దానికి ఆమోదం తెలిపి టీఎస్‌ఆర్టీసీ కార్మికుల చేత కేసీఆర్‌ చిత్రపాఠాలకు పాలాభిషేకాలు చేయించుకోవడం ప్లాన్-ఏ.

ప్లాన్-ఏ ఉన్నప్పుడు ప్లాన్-బి కూడా తప్పక ఉంటుంది. అదేమిటంటే, ఇప్పటికే గవర్నర్‌ పలు బిల్లులు పక్కన పెట్టారు. రెండు బిల్లులను ఆమోదించకుండా వెనక్కు తిప్పి పంపారు కూడా. కనుక ఈ బిల్లును కూడా ఆమె పక్కన పెట్టవచ్చు లేదా తిప్పి పంపవచ్చని సిఎం కేసీఆర్‌కు బాగా తెలుసు. ఆయన ఊహించిన్నట్లే ఆమె బిల్లుని ఆమోదించలేదు. దాంతో కేసీఆర్‌ ప్రభుత్వం వెంటనే ప్లాన్-బి అమలుచేయడం మొదలుపెట్టేసింది.

అదే… టీఎస్‌ఆర్టీసీ కార్మికుల చేత ఆమెకు వ్యతిరేకంగా ఈరోజు ఉదయం 2 గంటల సేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహింపజేయడం. వారు డిపోల నుంచి బస్సులు బయటకుతీయకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆవిదంగా టీఎస్‌ఆర్టీసీ కార్మికుల, ప్రజల ఆగ్రహాన్ని గవర్నర్‌పైకి మళ్లించడమే ప్లాన్-బి.

పనిలో పనిగా కాంగ్రెస్‌, బిజెపిలవైపు పక్క చూపులు చూస్తున్న ప్రజలందరినీ మళ్ళీ ఏదో ఓ సెంటిమెంటుతో బందించి త్వరలో జరుగబోయే ఎన్నికలలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసేలా చేసుకోవడమే అంతిమ లక్ష్యంగా భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories