ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీలో విపక్షం వైసీపీకి క్రమంగా దగ్గరవుతున్నారన్న వాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఉండవల్లి వ్యవహరిస్తున్న రాజకీయ విధానం మరియు తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంగా జరిగిన ఏకాంత చర్చలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
ఉండవల్లి అరుణ్ కుమార్ తల్లి కాలం చేయడంతో పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వెళ్లిన జగన్, నేరుగా ఉండవల్లి గృహానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లితో జగన్ కొద్దిసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ చర్చల్లో రాజకీయ అంశాలే చర్చకు వచ్చినట్లు మీడియా వర్గాల్లో కధనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ భేటీపై వైసీపీ వర్గాలు మాత్రం ‘అలాంటిదేమీ లేదని’ కొట్టిపడేస్తున్నాయి.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరున్న ఉండవల్లి మళ్లీ రాజకీయ పరంగా యాక్టివ్ అయితే మాత్రం జగన్ చెంతకే చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. గతంలో పట్టిసీమ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ అధినేత జగన్ కు సమర్ధనీయంగా వ్యాఖ్యానించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.



