తెలంగాణలో అన్ని పార్టీలు, అన్నివర్గాల ప్రజలు కలిసి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ ఆ క్రెడిట్ పూర్తిగా కేసీఆర్ తీసేసుకున్నారు. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఉద్యమాలలో అన్ని పార్టీల సహకారం తీసుకున్న ఆయన, ముఖ్యమంత్రి కాగానే వాటిన్నిటినీ నిర్ధాక్షిణ్యంగా తొక్కి పడేశారు.
తన అధికారానికి, తన పార్టీకి, తన కుటుంబానికి ప్రమాదమనుకున్న ప్రతీ ఒక్కరినీ, ప్రతీ పార్టీని చావు దెబ్బ తీశారు. చివరికి ఏపీ రాజకీయాలలో కూడా వేలుపెట్టి చంద్రబాబు నాయుడుని గద్దె దించి ఏపీకి తీరని నష్టం కలిగించారు.
అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడి చచ్చిందన్నట్లు, కేసీఆర్ కూడా తన ఖర్మలకి తాను బలైపోవడమే కాదు తన పార్టీని కూడా బలి చేశారు.
పదేళ్ళుకుపైగా సాగిన తెలంగాణ ఉద్యమాల పుణ్యమాని పార్టీని బలోపేతం చేసుకున్న కేసీఆర్, ముఖ్యమంత్రి అయ్యాక చేసిన ఇటువంటి రాజకీయ తప్పిదాల వలన, కొడుకు, కూతుర్ల కేసుల కారణంగా, కేవలం ఏడాది వ్యవధిలోనే బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యే దశకు చేరుకుంది.
కేసీఆర్ వ్యూహాలకు తిరుగే ఉండదని గొప్పలు చెప్పుకునేవారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు మించి వ్యూహాలతో బిఆర్ఎస్ పార్టీని చట్ట ప్రకారమే చావుదెబ్బ తీస్తుండటం విశేషం.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి లోపల వేసేయాలనే తాపత్రయంలో జగన్ గవర్నర్ అనుమతి తీసుకోలేదు. కానీ కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి రేవంత్ రెడ్డి ముందుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి తీసుకున్నారు. అంటే కేంద్రం అనుమతి కూడా తీసుకున్నారనుకోవచ్చు. అందుకే ఈడీ కూడా రంగంలో దిగి కేసు నమోదు చేసింది.
ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్ ఎంత ఆవేశంగా మాట్లాడేస్తున్నప్పటికీ, రేవంత్ రెడ్డిపై ఎంతగా విరుచుకుపడుతున్నప్పటికీ, ఈ కేసులో అవినీతి జరిగిందని ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, కనుక దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడంతో కేటీఆర్ వాదనలకు విలువ లేకుండా పోయింది!
రేవంత్ రెడ్డి కొట్టిన ఈ దెబ్బకు కేటీఆర్ తేరుకోలేకపోతున్నారు. అయినా ప్రగల్భాలు మానుకోలేదు. రేవంత్ రెడ్డిని అవహేళన చేయడం మానుకోలేదు.
ఈవిదంగా మాట్లాడినందుకే కేసీఆర్ ఎదురుదెబ్బ తిన్నారు. ఇప్పుడు కేటీఆర్ అదే తప్పు చేస్తున్నారు. వీటిని ఎవరు మారిచిపోయినా రేవంత్ రెడ్డి మరిచిపోరు. కనుక వీటికీ కేటీఆర్ మూల్యం చెల్లించక తప్పక పోవచ్చు.
ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాలేదు. కనీసం మీడియా ముందుకు వచ్చి కొడుకు కేసు గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు!
ఆయన మౌనానికి అర్దం ఏమిటి?అని అందరూ అడుగుతున్నారు. రేవంత్ రెడ్డితో చలగాటం ప్రమాదమని కేసీఆర్‌కి ఎన్నికలలో ఓడిపోయినప్పుడే అర్దమయిందనుకోవాలా?అందుకే ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రావడం లేదా? అందుకే ఇప్పుడూ మౌనంగా ఉండిపోతున్నారా?లేదా కొడుకుని కాపాడుకోవడానికి మళ్ళీ తెర చాటు ప్రయత్నాలు చేసుకుంటున్నారా?అంటే రాబోయే రోజులలో తెలుస్తుంది.
లిక్కర్ కేసులో చిక్కుకున్న కూతురు కల్వకుంట్ల కవితని కాపాడుకోవడం కోసం ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని బలి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఎఫ్-1 రేసింగ్ కేసులో పీకలలోతు కూరుకుపోయిన కొడుకు కేటీఆర్‌ని కాపాడుకునేందుకు బలి పెట్టడానికి మిగిలిన పార్టీ సరిపోదు. పాపం ఏం చేస్తారో?




