Narendra_Modi_Amit_Shahదేశంలో దాదాపు అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత దీని కోసం ఢిల్లీలో రెండు రోజులు ధర్నాలు కూడా చేశారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కూడా.

దీని కోసం పోరాడుతూ మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చని అన్ని పార్టీలు అనుకొన్నాయి. కానీ దీంతోనే ఎవరి గొయ్యి వారే తవ్వుకొనేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్షాల కళ్ళను వాటి వేలితోనే పొడుచుకొనేలా చేయబోతోంది.

నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకి ఆమోదముద్ర వేసిన్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ట్వీట్ చేశారు. కనుక మోడీ ప్రభుత్వం నేడు ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. దీనికి పార్లమెంట్‌ ఆమోదం లాంఛనప్రాయమే.

మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలలో తప్పనిసరిగా 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించవలసి ఉంటుంది. దీని కోసం పోరాడుతున్న బిఆర్ఎస్‌ పార్టీకే మొట్టమొదట ఎదురుదెబ్బ తగులుతుంది.

ఏవిదంగా అంటే, తెలంగాణలో మొత్తం 119 శాసనసభ స్థానాలకు బిఆర్ఎస్‌ పార్టీ 115 మంది అభ్యర్ధులతో ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించింది. దానిలో కేవలం ఏడుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాలిస్తే మొత్తం 39 మందికి మహిళలకు టికెట్స్ ఈయవలసి ఉంటుంది.

అంటే ఒకేసారి 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి వారి సీట్లు మహిళా అభ్యర్ధులకు ఇవ్వక తప్పదన్న మాట! అలా చేస్తే వారిలో తీవ్ర అసంతృప్తి, అసహనం, ఆందోళన మొదలవుతాయి. మిగిలిన 80 సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి.

కనుక ఈ బిల్లు కారణంగా పోటీ చేయలేకపోయే 39 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి అయోమయంగా మారుతుంది. దీంతో బిఆర్ఎస్‌ పార్టీలో గందరగోళం మొదలవుతుంది.

ఈ బిల్లు వలన బిఆర్ఎస్‌తో సహా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల బలాబలాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి ముఖ్యంగా ఎన్నికల ముంగిట ఉన్న తెలంగాణలోని పార్టీలపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది. వాటికి ఆలోచించుకొనేందుకు కూడా సమయం లేదిప్పుడు.

ఏపీలో టిడిపి, జనసేన, వైసీపిల మీద కూడా ఈ ప్రభావం చాలానే ఉంటుంది. అయితే వాటికి ఆలోచించుకోవడానికి, దీని వలన నష్టపోకుండా తగిన మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆరేడు నెలల సమయం ఉంది. కానీ ఒకవేళ జగన్‌ ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటే ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపికి కూడా ఈ బిల్లు చాలా ఇబ్బందికరంగా మారుతుంది.