ఉద్యోగుల సమ్మె నుండి ప్రభుత్వాన్ని పరిరక్షించడంలో “ఆ నలుగురు” ఉద్యోగ సంఘ నేతలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యారు. రెండు రోజుల క్రితం విజయవాడలో ఉధృత స్థాయిలో ఉన్న ఉద్యమం కొద్దీ గంటల వ్యవధిలో ఎలా నీరుగారిపోయింది? బహుశా ప్రభుత్వం తలొగ్గి ఉద్యోగులు చేసిన డిమాండ్స్ ను ఒప్పుకుందా? అంటే లేదనే సమాచారమే వెలువడుతోంది.
అయితే ఇదంతా “ఆ నలుగురు” ఉద్యోగ సంఘ నేతల వలనే సాధ్యమైందన్న టాక్ బలంగా వినపడుతోంది. పీఆర్సీ సాధన సమితి పేరిట ఒక్కటైన బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, పి.చంద్ర శేఖర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలే ఉద్యోగులకు దక్కాల్సిన ఏ ఒక్కటి దక్కకపోయినా ఉద్యమాన్ని విరమించుకున్నారు. ఈ నలుగురు విధానంతో కలత చెందిన ఉపాధ్యాయ సంఘం మాత్రం తమ పోరాటం కొనసాగిస్తామంటుంది.
నిజానికి ఈ నలుగురు కూడా ప్రభుత్వ తొత్తులన్న విషయం బహిరంగమే. రఘురామకృష్ణంరాజు వంటి పలువురు రాజకీయ నేతలు కూడా పరోక్షంగా ఉద్యోగులకు హెచ్చరికలు చేసారు. నాడు పీఆర్సీ ప్రకటించిన సందర్భంలో ఈ నలుగురు కూడా ప్రభుత్వానికి అభివాదాలు తెలిపారు. కానీ తగ్గిన జీతాలు రావడంతో, ఉద్యోగులంతా ఒక్కసారిగా ఉక్కుపాదం మోపడంతో, “ఆ నలుగురు” కూడా ప్రభుత్వానికి ఎదురు తిరగక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయాన్ని ఒకానొక సందర్భంలో బండి శ్రీనివాసరావే స్వయంగా వెల్లడించారు కూడా. ఇప్పటివరకు మీరు ఆడించినట్లు ఆడాము, ఇంకా ఆడితే మా నడ్డి విరిచేలా ఉన్నారంటూ జగన్ సర్కార్ గురించి తెలిపారు. అలా ప్రభుత్వానికి ఎదురు తిరిగినట్లు నటించిన ఆ నలుగురు ఉద్యోగుల వైపు ఉన్నట్లుగా ఉండి, కొత్త పీఆర్సీ రద్దు చేసే వరకు చర్చలు అన్న ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.
అలా కొన్ని రోజుల పాటు మీడియాలలో సందడి చేసిన ఆ నలుగురు, లిఖిత పూర్వకంగా పిలిస్తే చర్చలకు వెళ్తామని మాట మార్చారు. వీళ్ళు అలా చెప్పడం, ప్రభుత్వం ఇలా పిలవడం జరిగిపోయాయి. చర్చలకు వెళ్లారు, మొదటి రోజు విఫలం అన్నారు. లోపల చర్చలేమీ జరగట్లేదు, కేవలం టీ – స్నాక్స్ ఇచ్చి పంపించి మమ్మల్ని అవమానిస్తున్నారని చెప్పారు.
కానీ సమ్మెకు ఒక్క రోజు ముందు అంతా సర్దుమణిగిపోయిందని చెప్తూ సమ్మె విరమించారు. ఇందులో హర్షించదగ్గ విషయం ఏమిటంటే… సమ్మె విరమణ. అసలే ఏపీ కష్టకాలంలో ఉన్న తరుణంలో… ఇప్పుడు సమ్మె చేపడితే అది మరింత అనర్ధాలకు దారి తీసుకుంది. కానీ ఆ నలుగురు ఉద్యోగ సంఘ నేతలను పక్కన పెడితే, వీరిని నమ్మి పీఆర్సీ బాధ్యతలను అప్పగించిన లక్షలాది మంది ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అంటే… మింగలేక, కక్కలేక అన్న మాదిరి తయారయ్యింది.
మరింత శోచనీయమైన విషయం ఏమిటంటే… సమ్మె విరమించిన తర్వాత తాము ఫలానా సాధించాము, అందుకే సమ్మె విరమించాము అని ప్రకటన చేయడం సర్వసాధారణం. కానీ అందుకు విరుద్ధంగా “ఆ నలుగురు” కూడా ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ జగన్ మోహన్ రెడ్డిని మరియు సజ్జల రామకృష్ణా రెడ్డిని క్షమాపణలు అడిగారు. ఈ క్షమాపణల పోటీ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.
బహుశా ఉద్యోగస్తులు చేసిన డిమాండ్ లన్నీ ప్రభుత్వం పూరించినట్లయితే, క్షమాపణలే కాదు, ఇంకా ముందడుగు వేసి ఏ కార్యక్రమాలు చేసినా ‘విధం చెడినా ఫలితం దక్కిందని’ సంతోషించే వారు. కానీ ఇక్కడ ఉద్యోగులకు దక్కింది ఏమీ లేదు, వీళ్ళు సాధించింది ఏమీ లేదు, కేవలం కాలయాపన తప్ప! “ఆ నలుగురు” ద్వారా జగన్ సర్కార్ పనయితే చాలా తేలిక అయ్యిందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.



