ఎలియన్స్ ఉన్నారో లేదోనన్నది శాస్త్రజ్ఞులకు అంతుపట్టని మిస్టరీ. ఎవరి వాదన ఎలా ఉన్నా, ఎప్పుడూ ఏదొక చోట తమ ప్రభావాన్ని చూపుతున్నారని, అది మానవ వినాశకానికి దారి తీస్తుందని పలువురు మేధావులు ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. ఇండియాలో వీటి ప్రభావం తక్కువే అయినా, తాజాగా తమిళనాడులో జరిగిన ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.
ఎవరూ ఊహించని రీతిలో ఆకాశం నుంచి బంతి ఆకారంలో ఉన్న ఒక వింత వస్తువు కిందపడింది. ఈ వస్తువును చూసి స్థానిక ప్రజలు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. కరూర్ జిల్లా గౌండపాళయంలోని కుళందై స్వామి అనే రైతు ఇంటి సమీపంలో గురువారం నాడు సాయంత్రం ఈ సంఘటన జరిగింది. సుమారు పదికిలోల బరువున్న ఆ వింత వస్తువులో గుండ్రటి ఇనుప రేకు కనిపించింది.
భారీ శబ్దంతో పైనుంచి కిందపడిన ఈ వస్తువు దగ్గరకు వెళ్లటానికి ప్రజలు భయపడ్డారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసు, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖల సిబ్బందితో పాటు బాంబు స్క్వాడ్ నిపుణులు అక్కడికి వెళ్లారు. ఈ వింత వస్తువు గురించి తెలుసుకునేందుకు గాను చెన్నై నుంచి రక్షణ విభాగానికి చెందిన అధికారులను పిలిపించారు. దీంతో వారి నుండి ఎలాంటి ప్రకటన వెలువడనుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు.



