పెరటి మొక్క వైద్యానికి పనికి రాదన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా ఉన్న పర్యాటక ఆకర్షణ కేంద్రాల కంటే దేశ విదేశాలలోని పర్యాటక ప్రాంతాలు చుట్టి రావడానికే చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇందుకు వారిని నిందించాల్సిన అవసరం లేదు.
దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని పట్టించుకునే నాధుడే లేడు. పెద్దగా రాజకీయ పరపతి లేని ఎమ్మెల్యేలకు లేదా మంత్రి అనిపించుకోవాలని ఆరాటపడుతున్నవారికి ఆ పర్యాటకశాఖ అప్పగిస్తుంటారు. ఆ శాఖకి కేటాయింపు అంతంత మాత్రంగానే ఉంటాయి. కనుక కనుక ఆ శాఖ పనితీరు, అంతంత మాత్రంగానే ఉంటుంది.
అందువల్లే రాష్ట్రంలో వందలాది పర్యాటక ఆకర్షణ కేంద్రాలున్నా నేటికీ అక్కడ కనీస సౌకర్యాలు లేవు. కనుక పర్యాటకులు ఆసక్తి చూపరు. అందువల్ల అవి గుర్తింపుకు కూడా నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చి చాలా ప్రోత్సహిస్తోంది.
గుంటూరు సమీపంలో ఉప్పలపాడు వద్ద పక్షుల అభయారణ్యం ఉంది. అదృష్టవశాత్తు దీనిని అటవీశాఖ బాగా అభివృద్ధి చేసింది. ఇక్కడికి అనేక అరుదైన జాతుల పక్షులు ఆస్ట్రేలియా, సైబీరియా నుంచి వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి సందడి చేస్తుంటాయి.
ఏటా అక్టోబర్ నుంచి పక్షులు అక్కడికి రావడం మొదలవుతుంది. మార్చి వరకు అంటే సుమారు ఆరేడు నెలలు అక్కడే ఉండి గూళ్ళు కట్టుకొని గుడ్లు పెడతాయి. ఆ పిల్లలు కాస్త పెరిగిన తర్వాత వాటితో కలిసి మళ్ళీ స్వదేశాలకు తిరుగు ప్రయాణం అవుతాయి. ఏటా దాదాపు 30,000 పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్ పక్షులు ఉప్పలపాడు అభయారణ్యంకి వస్తుంటాయి. ఇలాంటి పర్యాటక ఆకర్షణ కేంద్రాలని రాష్ట్ర ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేయగలిగితే పర్యాటకుల సంఖ్యా దానితో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది.






