కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న కాపు ఐక్యవేదిక, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి టీ కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ వి హన్మంతరావు మద్దతుగా నిలిచారు. ఏపీలో కాపుల డిమాండ్లు న్యాయ సమ్మతమైనవేనని పేర్కొన్న వీహెచ్, కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. లేని పక్షంలో కాపుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఈ సందర్భంగా వీహెచ్… జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ పై చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా నిలిచాయి. కాపులకు న్యాయం చేసేందుకు పవన్ కల్యాణ్ చర్యలు చేపట్టాలని, పవన్ తన మౌనం వీడి ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలన్నారు. కాపుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ఏపీ ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన వీహెచ్, కాపుల ఉద్యమాన్ని కేసులతో అణచి వేయాలని చూస్తే సహించబోమని కూడా హెచ్చరికలు జారీ చేశారు.



