మొత్తానికి కాస్త ట్రీట్‌మెంట్‌తో వైసీపి సోషల్ మీడియా కాస్త క్లీన్ అయ్యింది. వైసీపి సోషల్ మీడియాలో చెలరేగిపోయిన అందరినీ పోలీసులు లోపల వేస్తుండటంతో ఆ మేరకు ఖాళీ ఏర్పడింది. కనుక వారి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్ నోటిఫికేషన్ (పిలుపు) మేరకు వైసీపి నేతలందరూ మళ్ళీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు.
అయితే ఇదివరకు మీడియా ముందుకు వస్తే నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూ చెలరేగిపోయే వైసీపి నేతలు సైతం ఇప్పుడు కాస్త పద్దతిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపి నేతలలో ఈ ‘గుణాత్మక మార్పు’ చాలా మంచి పరిణామమే.
అయితే వారి అధినేత జగన్ వారిని అలా దారిలో పెట్టి ఉంటే ప్రజలు కూడా హర్షించేవారు. కానీ వారిని కూడా సిఎం చంద్రబాబు నాయుడే దారిలో పెట్టాల్సి వచ్చింది. కానీ జగన్‌ని దారిలో పెట్టలేకపోతున్నారు. అందుకు మరికొంత సమయం పట్టవచ్చు.
వైసీపి నేతలందరూ 175వ నంబర్ బాధితులే. వాలంటీర్లలాగ నష్టపోయినవారే. కానీ వేరే గత్యంతరం లేదు కనుక 2029లో జరుగాల్సిన ఏపీ శాసనసభ ఎన్నికలు 2027లోనే జరుగుతాయని చెపుతున్నా, వాటిలో మనమే గెలిచి అధికారంలోకి వస్తామని చెపుతున్నా వంతపాడక తప్పడం లేదు.
ప్రభుత్వం, సిఎం చంద్రబాబు నాయుడు తన ప్రశ్నలకు, ఆరోపణలకు జవాబులు చెప్పాలని కోరుకుంటున్న జగన్, శాసనసభ సమావేశాలు ఎందుకు హాజరు కావడం లేదంటూ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, చెల్లి షర్మిల అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పడం అవసరం లేదని భావిస్తున్నారు.
జగన్ ఎవరికి సమాధానం చెప్పుకోకపోయినా వైసీపికి ఓట్లేసిన 38శాతం మంది ప్రజలకు తప్పనిసరిగా జవాబు చెప్పుకోవాలనే చెల్లి షర్మిల మాట నూటికి నూరు శాతం నిజమని అందరూ అంగీకరిస్తారు.
ఏది ఏమైనప్పటికీ జగన్ శాసనసభకు రాకుండా సొంత మీడియా, సోషల్ మీడియా ద్వారానైనా తాను చెప్పదలచుకున్నవి చెపుతూ, అడగదలచుకున్నవి అడుగుతున్నందుకు చాలా సంతోషమే. కానీ వైసీపి నేతలు ఎంతకాలం ఇలా బుద్ధిగా ఉంటారు?అంటే సమాధానం చెప్పడం కష్టమే. కనుక కొంత కాలమైనా సోషల్ మీడియా పరిశుభ్రంగా ఉందని సంతోషించాలి.
చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి కేవలం 5 నెలలే అయ్యింది. కానీ సూపర్ సిక్స్ హామీలు ఇంకా ఎందుకు అమలుచేయడం లేదని జగన్ అడుగుతుండటం, పార్టీలో అందరూ కూడా వాటి గురించి సిఎం చంద్రబాబు నాయుడుని నిలదీయాలని సూచించడం చూస్తే జగన్‌కు ఆరాటమే తప్ప పోరాటం చాతకాదని అర్దమవుతుంది.




