వాహ్ వంశీ వాహ్.. మీ స్వామిభక్తి అమోఘం!

Vallabhaneni Vamsi Met Jagan Mohan Reddy After Release

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈరోజు భార్యతో కలిసి వల్లభనేని వంశీ తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చి అధినేత జగన్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ ఫోటో, వీడియోని వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది.

సాధారణ పరిస్థితిలో అయితే రాజకీయాలలో ఇదేమీ పెద్ద విచిత్రం కాదు. కానీ వంశీ అరెస్ట్‌ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు జగన్‌ వెళ్ళి జైల్లో ఉన్న ఆ అండగాడిని పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ పలకరించలేదు. కనీసం ఆయన ప్రస్తావన చేయలేదు.

ADVERTISEMENT

వంశీ 5 నెలలు జైల్లో ఉండి విడుదలై బయటకు వచ్చినప్పుడు వంశీ సతీమణి, వారి అనుచరులు కొద్ది మంది, పేర్ని నాని మాత్రమే వచ్చి తోడ్కొని వెళ్ళారు. వంశీని పలకరించడానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ రాలేదు!

కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్నప్పుడు తమ పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోలేదని, అసలేమీ జరగనట్లు పార్టీలో అందరూ ఎవరి పనులు వారు చూసుకున్నారని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

వల్లభనేని వంశీ అరెస్ట్‌ అయ్యి జైల్లో ఉన్నప్పుడు, ఆయన అనారోగ్యంతో జైలుకి-హాస్పిటల్‌కు మద్య తిరుగుతున్నారని తెలిసి ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్‌తో సహా ఆ పార్టీ నేతలందరూ అలాగే వ్యవహరించారని అర్దమవుతూనే ఉంది.

వంశీ స్వయంకృతాపరాధాలతో పాటు జగన్‌ సహవాసం వల్లనే జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని అందరికీ తెలుసు. కనుక జగన్‌ కోసం, వైసీపీ కోసం జైలుకి వెళ్ళినా ఎవరూ పట్టించుకోలేదు కనుక ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత వైసీపీకి రాజకీయాలకు గూడ బై చెప్పేయడమో లేదా కొంతకాలం పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటారని అందరూ భావిస్తే ఆయన తాడేపల్లి ప్యాలస్‌కి వెళ్ళి జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.

అంటే వల్లభనేని వంశీ స్వామి భక్తి ఏమాత్రం తగ్గలేదని, జైల్లో ఉన్నా ఆలోచనా ధోరణిలో ఎటువంటి మార్పులు కలగలేదని స్పష్టమవుతోంది. కనుక ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్ళీ చురుకుగా వైసీపీ రాజకీయాలలో పాల్గొంటారేమో?

ADVERTISEMENT
Latest Stories