‘వారాహి చలన చిత్రం’ ప్రొడక్షన్ సంస్థకు టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి అండదండలు ఉన్న విషయం బహిరంగమే. ఈ సంస్థలో ఏ సినిమా నిర్మించినా, ఆ సినిమా ఆడియో వేడుకకు విచ్చేయడంతో పాటు తొలి రోజే సినిమా చూసి, ఓ చిన్న సైజు రివ్యూను కూడా జక్కన్న అందిస్తూ ఉంటారు. వినూత్నమైన కధలను తెరకెక్కించడంలో ఈ సంస్థకు టాలీవుడ్ ఓ ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి.
తాజాగా ఆ సంస్థలో నిర్మాణంలో రూపుదిద్దుకున్న “జ్యో అచ్యుతానంద” సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నారా రోహిత్, నాగశౌర్య, రెజినా ప్రధాన పాత్రల్లో నటించారు. ఓవర్సీస్ తో సహా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ళతో దూసుకెళ్తున్న సందర్భంలో… వారాహి చలన చిత్ర సంస్థ అధినేత కొర్రపాటి సాయి కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల పర్యవసానం ఏంటన్న సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ దాడులు టాలీవుడ్ ప్రకంపనలు రేపుతున్నాయి. చిన్న చిత్రాలను నిర్మిస్తూ, ఓ మంచి బ్యానర్ గా ప్రజల మన్ననలు పొందుతున్న తరుణంలో… ఈ దాడులు రాబోయే సినిమాల మీద ప్రభావం చూపుతుందేమో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో టాలీవుడ్ నిర్మాతలపై ఈ తరహా ఐటీ దాడులు సర్వసాధారణమైపోయాయి



