అనిల్‌కు వేమిరెడ్డి పొగ… వేమిరెడ్డికి జగన్‌ జలక్!

Vemireddy Prabhakar Reddy Anil Kumar Yadav

ఇంతకాలం వైసీపికి కంచుకోటలా కనిపించిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు చంద్రముఖి లకలకలు వినిపిస్తున్నాయి. వైసీపి రాజ్యసభ సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి జిల్లాలో, పార్టీలో కూడా మంచి పట్టుంది. జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే అతికొద్దిమందిలో ఆయన కూడా ఒకరు.

కనుక ఈసారి ఆయనకు నెల్లూరు లోక్‌సభ అభ్యర్ధిగా అవకాశం లభించింది. ఇదే కారణంగా ఆయన నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మూడు శాసనసభ నియోజకవర్గాలలో తాను సూచించిన వారికే టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టి, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌ని తప్పించేశారు. ఆయన పొగ పెట్టడంతో అనిల్ కుమార్‌ యాదవ్ మూటామూల్లే సర్దుకుని నర్సారావుపేటకు వెళ్ళిపోవలసివచ్చింది.

ADVERTISEMENT

ఆ సీటుని తన భార్య ప్రశాంతి రెడ్డికి లేదా మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్‌కు ఇవ్వాలని జగన్‌కు ముందే సూచించారు.

కానీ అనిల్ కుమార్‌ యాదవ్‌లో ప్రవహిస్తున్నది కూడా వైసీపి రక్తమే. కనుక ఆయన పోతూపోతూ తన సీటుని తన అనుచరుడు, నగర డెప్యూటీ మేయర్ మహమ్మద్ ఖలీల్‌ ఖాన్‌కు ఇప్పించుకున్నారు. అయితే ఈ విషయం వైసీపి 6వ జాబితా ప్రకటించే వరకు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి తెలియలేదు.

దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. శనివారం హటాత్తుగా నెల్లూరు నుంచి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తన అనుచరులు, కార్యాలయ సిబ్బందిని కూడా వైసీపి నేతలకు దూరంగా ఉండాలని, తనను ఎవరూ కాంటాక్ట్ చేయవద్దని హెచ్చరించి వెళ్ళిపోయిన్నట్లు తెలుస్తోంది.

జగన్‌కు ఇంత సన్నిహితంగా ఉండే తనకు మాట మాత్రంగా చెప్పకుండా నెల్లూరు సిటీ అభ్యర్ధిని ఖరారు చేయడం, అదీ… తాను వద్దని చెప్పిన ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్ సూచించిన వారికి ఇవ్వడాన్ని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తీవ్ర అవమానంగా భావిస్తున్నారు.

తప్పనిసరిగా నెల్లూరు సిటీ ఇన్‌చార్జిని మార్చాలని లేకుంటే లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయబోనని అనుచరుల ద్వారా జగన్‌కు సందేశం పంపిన్నట్లు తెలుస్తోంది.

కనుక ఒంగోలులో బాలినేని, మాగుంట, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఇలా ప్రతీ జిల్లా, నియోజకవర్గానికి కొందరు సీనియర్ నేతలు అలక పాన్పులు ఎక్కుతూనే ఉన్నారు. పార్టీ అభ్యర్ధులలో మార్పులు చేర్పులు చేస్తే 175/25 సీట్లు గెలుచుకోగలమని జగన్‌ చెప్పుకుంటున్నారు. కానీ పార్టీలో ఈ పరిస్థితులు చూస్తుంటే అంత సీన్ లేదనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories