డబ్బు, సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకోవాలని అనుకోవడం తప్పు కాదు. కానీ అందుకు ఇతరుల జీవితాలతో ఆడుకోకూడదు. ఆడుకుంటే ఏమవుతుందో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తాజా పరిస్థితి చూస్తే అర్దమవుతుంది.
శుభామా అని నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్ళి చేసుకోబోతుంటే వేణుస్వామి పిలవని పేరంటంలా వారి జాతకాలు చూసి మూడేళ్ళలో ఇద్దరూ విడిపోతారని చెప్పడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఒకవేళ వారి శ్రేయోభిలాషిగా చెప్పాలనుకుంటే వారికో వారి పెద్దలకో ఫోన్ చేసి చెప్పదలచుకున్నది చెప్పొచ్చు. కానీ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్నారు.
మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఫోన్ చేసి వేణుస్వామికి వార్నింగ్ ఇచ్చిన్నట్లు వార్తలు వచ్చాయి. ఫిలిమ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఆయనపై మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో నేడు ఆ విచారణకు హాజరయ్యి సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది.
అయితే వేణుస్వామి చేజేతులా వివాదం సృష్టించుకుని దాని నుంచి బయట పడే ప్రయత్నం చేయకపోగా, మరింత పెద్దది చేసుకున్నారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 మూర్తి, రాంబాబు తదితరులు తమని రూ.5 కోట్లు ఇమ్మనమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వేణుస్వామి సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన భార్య వాణీ శ్రీవాణి కూడా భర్తతో కలిసి ఆ వీడియోలో మాట్లాడుతూ, మేము అంత సొమ్ము ఎక్కడి నుంచి తేగలము?మా బంగారం అంతా అమ్మినా కూడా సరిపోదు. ఈ వేధింపులు భరించలేక మేము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాము కానీ వారికి భయపడి ఆత్మహత్య చేసుకుంటే మా చావులని కూడా వక్రీకరిస్తారు. వాళ్ళు ఎలాగూ మమ్మల్ని చంపేస్తారు. అప్పుడైనా ప్రజలకు మేము ఎటువంటి వారమో తెలుస్తుంది,” అని అన్నారు.
కానీ టీవీ5 ఆ న్యూస్ ఛానల్ ఎడిటర్ మూర్తి, ఆ ఛానల్ ఎంటర్‌టైన్‌మెంట్ హెడ్ రాంబాబు వారి ఆరోపణను ఖండించి తమపై అసత్య ఆరోపణలు చేస్తూ, తమ ప్రతిష్ట భంగం కలిగిస్తున్నందుకు తామే వారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఇతరుల సొంత విషయాలలో వేణుస్వామి వేలు పెట్టడమే చాలా తప్పు. ఆ సమస్యని ఈవిదంగా ఇంకా పెద్దది చేసుకోవడం ఇంకా పెద్ద తప్పు.
ఒకవేళ ఎవరైనా వారిని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. కానీ ఆత్మహత్య చేసుకుంటామని వీడియో రిలీజ్ చేయడం చూస్తే అతితెలివి ప్రదర్శిస్తున్నారని అనుమానించక తప్పదు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే ఏమయిందో చూశారు. ఇప్పుడు అతితెలివి ప్రదర్శిస్తే ఏమవుతుందో కూడా చూడబోతున్నారు.




