రాజకీయాల్లోకి వచ్చినవారిలో చాలామంది కాటికి పోయే వరకు పదవిలో ఉండాలని కోరుకుంటుంటే, సినీ పరిశ్రమలో ఉన్నవారు వీలైనంత త్వరగా నాలుగు రాళ్ళు వెనకేసుకొని బయటపడాలని చూస్తుండటం విశేషం.
అలాగని సినీ పరిశ్రమలో అందరూ ఇలాగే కోరుకుంటున్నారని కాదు కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునేవారు చాలా మందే ఉన్నారు.
కొందరు రియల్ ఎస్టేట్, హోటల్స్‌లో, జిమ్ సెంటర్స్ వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతుంటే, కొందరు థియేటర్లు, స్టూడియోలు నిర్మిస్తూ మళ్ళీ సినీ పరిశ్రమలోనే పెట్టుబడులు పెడుతున్నారు. భారీగా వచ్చిపడుతున్న ఆదాయంతో విలాసవంతంగా జీవిస్తూనే, ముందు చూపుతో వేర్వేరు రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్, విజయ్ దళపతి వంటి కొందరు సినిమాలు.. వాటి ద్వారా వచ్చే భారీ ఆదాయం, పేరు ప్రతిష్టలు, స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ వదులుకొని రాజకీయాలలో ప్రవేశించారు.
అయితే ముందు చెప్పుకున్నట్లుగా నానా పాటేకర్ వంటి కొందరు నటులు బంగారు గుడ్లు పెట్టే బాతు వంటి సినిమాలని, సినీ పరిశ్రమని వదిలేసి స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు.
ఇప్పుడు కోలీవుడ్‌లో విజయ్ ఆంటోనీ కూడా సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పేసి ఊర్లో వ్యవసాయం చేసుకుంటానని చెప్తున్నారు.
విజయ్ ఆంటోనీ నటించిన ‘నూరు సామి’ సినిమా ఈ నెల 19న విడుదల కాబోతోంది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, “నేను ఎప్పటికీ చెన్నైలో ఆడంబరంగా, విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకోవడం లేదు. నేను సింపుల్ జీవితం గడిపేందుకు ఎక్కువ ఇష్టపడతాను. జోహో అధినేత శ్రీధర్ వెంబులాగ నేను కూడా మరో మూడేళ్ళ తర్వాత తెన్‌కాశీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఆలోగా సినిమాలన్నీ పూర్తి చేస్తాను,” అని అన్నారు. సంపాదించిన పేరు ప్రతిష్టలు, డబ్బు చాలని సంతృప్తి చెంది తప్పుకోవడం చాలా అరుదు కదా?




