వైసీపీ తరపున ఎంపీ హోదాలో రాజ్యసభలో అడుగుపెట్టనున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి… ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తన ఆస్తులతో పాటు తనపై నమోదైన కేసుల వివరాలను కూడా విజయసాయిరెడ్డి వెల్లడించక తప్పలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో భాగంగా తనపై మొత్తం 13 కేసులు నమోదయ్యాయని, ఇక తనకు, తన భార్య, కుటుంబ సభ్యులకు మొత్తం 17.21 కోట్ల మేర ఆస్తులున్నాయని అఫిడవిట్ లో ప్రస్తావించారు.
తనతో పాటు తన భార్య కూడా వ్యక్తిగతంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నామని చెప్పిన విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎన్నికల బరిలో సతీమణి సునందారెడ్డితో ఓ డమ్మీ నామినేషన్ కూడా వేయించారు. ఈ క్రమంలో నామినేషన్ తో పాటు తన ఆస్తులు, తనపై నమోదైన కేసుల వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్ అందజేశారు. చివరి నిముషం వరకు ఉత్కంఠ రేపిన విజయసాయిరెడ్డికి పోటీ… చివరకు కాస్తంత మనశ్శాంతిని ఇచ్చింది.



