వాళ్ళందరూ జగన్‌ శ్రేయోభిలాషులేనా?

vijay-sai-reddy-sajjala-ramakrishna-reddy-jagan

“2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు, టిడిపి మూడేళ్ళపాటు అచేతనంగా ఉండిపోయారు. వారి ఉనికి ఎక్కడా వినపడలేదు… కనపడలేదు. కానీ జగన్‌ ఓటమి తర్వాత వెంటనే ప్రజా సమస్యలపై ఢిల్లీలో పోరాడారు. నిరంతరంగా రాష్ట్ర ప్రజలను కలుస్తూనే ఉన్నారు. ఇద్దరికీ అదే తేడా,” అని వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

ADVERTISEMENT

గత ఎన్నికలలో టిడిపి ఓడిపోయిన తర్వాత జగన్‌లాగ నెల రోజులకే రోడ్లపైకి వచ్చేసి ధర్నాలు దీక్షలు చేయని మాట వాస్తవం. కానీ ఇప్పుడు జగన్‌ చేయని అతి ముఖ్యమైన పని నాడు చంద్రబాబు నాయుడు చేశారు.

ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో ఓడిపోతే ముందుగా తమ ఓటమికి కారణాలను లోతుగా విశ్లేషించుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో గుర్తించి సరిదిద్దుకోవాలి. ఓటమికి తమ బలహీనతలే కాదు… ప్రత్యర్ధి బలం కూడా ఓ కారణం గ్రహించి అంగీకరించి, బలాబలాలను నిర్మొహమాటంగా అంచనా వేసుకోవాలి.

అన్ని సరిచూసుకునేలోగా కొత్త ప్రభుత్వం పనీతీరు, నిర్ణయాలు, విధివిధానాలుఎలా ఉన్నాయో తెలుస్తుంది. అప్పటికి కొత్త ప్రభుత్వం ‘హనీమూన్ పీరియడ్’ ముగుస్తుంది. కనుక అప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ పోరాటాలు మొదలుపెట్టాలి.

చంద్రబాబు నాయుడు సరిగ్గా అదే చేశారు. రాష్ట్రంలో టిడిపిని నామరూపాలు లేకుండా చేసేయాలని జగన్‌ చేసిన ప్రతీ ప్రయత్నాన్ని గట్టిగా తిప్పి కొట్టారు. జగన్‌ ప్రభుత్వం వేధింపులకు భయపడి టిడిపి చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకొంటూనే, ‘బాదుడే బాదుడు’ వంటి అనేక పోరాటాలు చేయించారు.

జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో కాలక్షేపం చేస్తుంటే చంద్రబాబు నాయుడు యువకుడైన నారా లోకేష్‌తో పోటీ పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలు చేస్తూ పార్టీలో ఉత్తేజం నింపుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టిడిపి ఆ స్థాయిలో పోరాటాలు చేసినందునే ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపి మూడు సీట్లు టిడిపికి కోల్పోయింది. ఐదుగురు సీనియర్ ఎమ్మెల్యేలను జగన్‌ బయటకు గెంటేసుకోవలసి వచ్చింది. ఆ పోరాటాల వలననే ఎన్నికలలో వైసీపి ఘోర పరాజయం పాలైంది కూడా.

అయినా చంద్రబాబు నాయుడు, టిడిపి ఉనికి కనపడనే లేదట! నిజానికి విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, తాడేపల్లి ప్యాలస్‌లో అధికారులు, ఐప్యాక్ ఇంకా అనేక మంది జగన్‌కు శల్యసారధ్యం చేసి వైసీపి ఓటమికి కారణం అయ్యారు.

ఒకవేళ విజయసాయి రెడ్డి నిజంగా జగన్‌ శ్రేయోభిలాషి అయితే శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు సభకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీయాలని సలహా ఇచ్చి ఉండాలి. ఢిల్లీలో ధర్నా చేయడం సరికాదని చెప్పి ఉండాలి. కానీ అదే గొప్ప విషయం అన్నట్లు ట్వీట్‌ వేశారు.

అంటే టిడిపికి చంద్రబాబు నాయుడుకి శ్రమ లేకుండా జగన్‌, వైసీపిని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేవరకు విజయసాయి రెడ్డి వంటివారు జగన్‌ని తప్పు దోవలో నడిపిస్తూనే ఉంటారన్న మాట! శభాష్ శభాష్!

ADVERTISEMENT
Latest Stories