Vijaya Sai Reddy's Resignation

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు అనుకున్నవారే ఒకరొకరు దూరం అవుతున్నారు. అందుకు ఆయనేమీ బాధపడటం లేదు. కానీ పోయినవాళ్ళు పోకుండా తన దురాశ, దుర్బుద్ధి, దోపిడీ, బలహీనతల గురించి టాంటాం చేస్తుండటమే చాలా ఇబ్బందికరంగా మారింది.

తెలంగాణకు పోయిందనుకున్న చెల్లి షర్మిల తిరిగివచ్చి మరో చెల్లి సునీతారెడ్డితో కలిసి వివేకానంద రెడ్డి హత్యతో జగన్‌ ప్రమేయం ఉందన్నట్లు మాట్లాడిన మాటలు ప్రజలు భయపడేలా చేశాయి.

Also Read – ఇక దువ్వాడ జీవితం మాధుర్యమే

ఆమెని కట్టడి చేయాలంటే ఆస్తులలో వాటాల గురించి ట్రిబ్యునల్లో కేసు వేయాలని ఎవరు జగన్‌కి సలహా ఇచ్చారో గానీ దాంతో మరింత పెంట అయ్యింది.

అన్నా చెల్లెళ్ల ఆస్తుల పంచాయితీ కోసం నన్నెందుకు కోర్టుకు లాగారంటూ తల్లి విజయమ్మ కూడా నిలదీయడంతో ఆస్తుల సంగతి దేవుడెరుగు వాటి కోసం తల్లిని చెల్లిని కూడా కోర్టుకీడ్చాడనే అప్రదిష్ట మాత్రం మిగిలిపోయింది.

Also Read – కాంట్రవర్సీ లో కీరవాణి?

ఆ పంచాయితీ ఇంకా ముగియక ముందే విజయసాయి రెడ్డి సడన్‌గా జంప్ అయిపోయారు. తనలాగ అందరికీ విలువలు, విశ్వసనీయత ఉండవు కనుక పోతే పోయారని జగన్‌ దులిపేసుకున్నారు. ఆయన పార్టీని, రాజకీయాలను విడిచిపెట్టేసినా జగన్‌ని మాత్రం విడిచిపెట్టడం లేదు!

రెండు మూడు రోజుల క్రితమే విజయవాడలో ‘కోటరీ కబుర్లు’ చెప్పి వెళ్ళారు. వాటిలో ఇంకేమి మిగిలిపోయాయని అనుకున్నారో ఏమో వాటికి కొనసాగింపుగా ‘మహారాజులు.. కోటలు, కోటరీలు’ అంటూ నిన్న ట్విట్టర్‌లో ఓ పెద్ద వ్యాసం పోస్ట్ చేశారు.

Also Read – అసలే రోజులు బాలేవ్‌.. అమిత్ షాతో చంద్రబాబు ఏం చెప్పారో!

కోటరీ దాటి కోట బయటకు వెళ్ళని మహారాజులు, వారి కోటలు, రాజ్యాలు అన్నీ కుప్పకూలిపోయిన్నట్లే ప్రజాస్వామ్యంలో కూడా జరుగుతుంది అని ముక్తాయించారు. అంటే ఇప్పటికైనా జగన్‌ తన చుట్టూ ఉన్న కోటరీని ఛేదించుకొని తాడేపల్లి ప్యాలస్‌ నుంచి బయటకు వచ్చి ప్రజల మద్యకు వెళ్ళాలని విజయసాయి రెడ్డి సూచిస్తున్నారన్న మాట!

వైసీపీ నుంచి, రాజకీయాలు నుంచి కూడా తప్పుకొని వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పిన విజయసాయి రెడ్డి, మళ్ళీ జగన్‌ వెంట ఎందుకు పడుతున్నారో తెలీదు కానీ జగన్‌కి పక్కలో మరో బల్లెంలా మారారు. ఎందుకు? అని ఆలోచిస్తే ప్రతీకారం కోసమే అనిపిస్తుంది.

జగన్ కోసమే, జగన్‌ కారణంగానే విజయసాయి రెడ్డి ఇన్ని కేసులలో చిక్కుకున్నారు. కానీ ఇంతకాలం ఆయన జగన్‌ కోటరీలో ఉంటూ చాలా గౌరవం పొందారు కనుక వాటన్నిటినీ భరించారు. తాను జగన్‌ కోసం జైలుకి కూడా వెళితే, కోటరీలో నేతల చెప్పుడు మాటలు విని జగన్‌ తనని అవమానించి బయటకుపోయేలా చేశారని విజయసాయి రెడ్డి బాధపడ్డారు.

కనుక ఈ కేసుల భారం ఇంకా మోయాల్సిన అవసరం లేదని విజయసాయి రెడ్డి భావిస్తుండటం సహజమే. కనుక ఎప్పటికైనా ఈ కేసులన్నిటినీ జగన్‌ మెడలో వేసి తాను బయటపడాలని విజయసాయి రెడ్డి కోరుకోవడం సహజమే. బహుశః ఆ ప్రయత్నంలోనే ఈ కోట.. కోటలో కోటరీ అంటూ యుద్ధం ప్రారంభించి ఉండవచ్చు. కనుక జగన్‌ మెడలో కేసులు వేయడంతో ఈ యుద్ధం ముగియవచ్చు.