టిడిపి ‘ఉండి’ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు శాసనసభ డెప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో సిఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు ఆనవాయితీ ప్రకారం ఆయనని సగౌరవంగా తోడ్కొని వెళ్ళి ఉప సభాపతి కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం అందరూ ఆయనకి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నాడు జగన్ ఆయనని ఏవిదంగా చిత్ర హింసలు పెట్టి అవమానించారో గుర్తు చేసుకున్నారు. రఘురామ కృష్ణరాజుని తన నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా జగన్ అడ్డుకుంటే నేడు ఆయనే శాసనసభలో మీ ఎదుట అడుగుపెట్టడానికి భయపడుతున్నారని అన్నారు. ఇది దేవుడి వ్రాసిన స్క్రిప్ట్ అని అన్నారు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలాగా ఈ ఆర్ఆర్ఆర్ (రఘురామ కృష్ణరాజు) కూడా అనేక రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నానని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జగన్ కర్మఫలం ఈవిదంగా ఉందన్నారు. ఆ ఒత్తిళ్ళన్నీ తట్టుకొని ధైర్యంగా పోరాడారంటూ పవన్ కళ్యాణ్ అభినందించారు.
గమ్మతైన విషయం ఏమిటంటే, ఎవరిని చూసి జగన్ శాసనసభకు వచ్చేందుకు ఇప్పుడు భయపడుతున్నారో ఆ రఘురామ కృష్ణరాజు ఉపసభాపతిగా ఎన్నికైనందుకు వైసీపి ఎంపీ, జగన్ రైటో హ్యాండ్ విజయసాయి రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరి ఈ విషయం జగన్‌కి ఇంకా తెలుసో తెలీదో? తెలిస్తే ఏం చేస్తారో?
ఏది ఏమైనప్పటికీ రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో కూర్చున్నప్పుడే జగన్‌ని గడగడలాడిస్తూ ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు శాసనసభలో ఉప సభాపతి కుర్చీలో కూర్చున్నారు. జగన్ వస్తే విడిచిపెడతారా? అందుకే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా మెలికతో తప్పించుకున్నారేమో?




