కష్టసుఖాలు, బాధలు సంతోషాలు, సమస్యలు సవాళ్ళు ఎప్పుడూ ఉండేవే. వాటి నుంచి కాస్త ఊరట కల్పించేవే పండగలు పబ్బాలు, తీర్ధయాత్రలు, విహారయాత్రలు, వనభోజనాలు వగైరా.
ఈ నెల 21 నుంచి మహాలయ పక్షాలు మొదలవుతాయి. తెలంగాణలో 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు మొదలవుతాయి. వాటి కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అప్పుడే పండగ శలవులు కూడా ప్రకటించాయి.
మహాలయపక్షాల ముగింపులో దసరా, ఆ తర్వాత దీపావళి పండగలొస్తున్నాయి. ఈసారి పండగల ముందు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ప్రజలు మరింత ఉత్సాహంగా పండగ షాపింగ్ చేస్తున్నారు. కనుక రాష్ట్రంలో దేశంలో పండగ వాతావరణం నెలకుంటోంది.
కనుక ఈసారి ఈ పండగ సంబరాలను ఇనుమడింపజేయడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వరకు విజయవాడలో అంగరంగ వైభవంగా ‘విజయవాడ ఉత్సవ్’ నిర్వహించబోతోంది.
ఈ 11 రోజులు సుప్రసిద్ధ తెలుగు సినీ సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో వరుసగా 11 సంగీత విభావరి కార్యక్రమాలు జరుగబోతున్నాయి.
అయితే ఈ విజయవాడ ఉత్సవ్‌ను నవంబర్ 16వరకు కొనసాగిస్తూ భారీ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించబోతున్నారు. దీనిలో ఏపీతో సహా దేశం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారులు, వ్యాపార సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేసి తమ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు నిర్వహిస్తాయి.
ఈ ఎగ్జిబిషన్‌లో పుస్తకాలు, బట్టలు, గృహోపకరణాలు, బొమ్మలు, ఆహార పదార్ధాలు వగైరా స్టాల్స్ ఉంటాయి. అలాగే వినోదం కోసం జాయింట్ వీల్, టాయ్ ట్రెయిన్స్ వగైరా వంటివి కూడా అనేకం ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ కూటమి పార్టీలు-వైసీపీ మద్య చాలా జోరుగా రాజకీయాలు సాగుతున్నందున కాస్త గంభీరమైన రాజకీయ వాతావరణమే నెలకొని ఉంది. కనుక ప్రజలకు ఈ విజయవాడ ఉత్సవ్ కాస్త ఆట విడుపుగా ఉంటుంది.
‘విజయవాడ ఉత్సవ్’లో మొదటి 11 రోజులు జరిగే సంగీత విభావరి కార్యక్రమాలలో పాల్గొని ఆనందించాలనుకునేవారు ‘బుక్ మై షో’ ద్వారా టికెట్స్ కొనుగోలు చేయవచ్చు.





