అన్నీ వైసీపి డిసైడ్ చేస్తే ఇక ప్రతిపక్షాలెందుకు?

Vijaysai Reddyఏపీలో వైసీపి రాజకీయ ధోరణి చాలా విచిత్రంగా ఉంటుంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకోవడం చాలా తీవ్రమైన నేరమన్నట్లు వాదిస్తుంటుంది. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయడానికే పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలో తిరుగుతున్నారని వాదిస్తుంటుంది. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ఉత్తరాంద్ర జిల్లాలలో పర్యటిస్తే వారు విశాఖ రాజధాని కాకుండా అడ్డుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని వాదిస్తుంటుంది.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి నియమకాన్ని కూడా విజయసాయి రెడ్డి తప్పు పడుతున్నారు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకే బీజేపీ అధిష్టానం ఆమెను నియమించిందని వాదిస్తుంటుంది.

ADVERTISEMENT

ఈ వితాండవాదనలు వింటే అసలు ఏపీలో ప్రతిపక్షపార్టీలన్నీ తమ కనుసన్నలలోనే మెలగాలని, తాము చెప్పిననట్లే రాజకీయాలు చేసుకోవాలని శాసిస్తున్నట్లనిపిస్తుంది. ఒకవేళ జగన్, విజయసాయి రెడ్డి కోరుకొన్నట్లుగానే టిడిపి, జనసేన, బీజేపీలు మసులుకొంటే ఇక ఆ పార్టీలు ఎందుకు?

తాజాగా విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గురించి మరో గొప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏమంటే, “సోము వీర్రాజుగారు అధ్యక్షుడిగా కొనసాగితే పురంధేశ్వరిలా అవినీతిపరులకు మద్ధతు పలికేవారు కాదు. టీడీపీ బలహీనతను వీర్రాజు గారు తన పార్టీకి అనుకూలంగా మార్చుకునేవారు. ‘బావ’సారూప్యత సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. చంద్రబాబు గారు కర్ణాటక డిప్యూటి సిఎం డీకే శివకుమార్ గారి ద్వారా ‘ఇండియా’ కూటమికి దగ్గరవుతున్న విషయం బిజెపి అధిష్ఠానానికి తెలుసు,” అని ట్వీట్ చేశారు.

వైసీపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కారణంగానే బీజేపీ అధిష్టానం సోము వీర్రాజును ఆ పదవిలో నుంచి తప్పించేసింది. కానీ ఆయనను కొనసాగించి ఉండాల్సిందని విజయసాయి రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు అర్దమవుతూనే ఉంది. అంటే ఏపీ బీజేపీ తమ చేతిలో కీలుబొమ్మలా ఉండాలని కోరుకొంటున్నారన్న మాట!

కానీ దగ్గుబాటి పురందేశ్వరిని నియమించడం పెద్ద తప్పన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే వైసీపి కోరుకొన్నవారే బీజేపీకి అధ్యక్షులుగా ఉండాలనుకొంటున్నారన్న మాట. పురందేశ్వరి, చంద్రబాబు నాయుడు బంధువులు కనుక ఆయనకు మద్దతు పలుకుతున్నారని, తమ పార్టీ టిడిపిని చావు దెబ్బతీసి బలహీనపరిచినప్పుడు, ఆమె ఈ అవకాశాన్ని బీజేపీకు అనుకూలంగా మలుచుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే ఆయన కోరుకొన్నట్లుగానే ఏపీ బీజేపీ రాజకీయాలు చేయాలన్న మాట!

చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి దగ్గరవుతున్నారని మరో హింట్ కూడా ఇచ్చారు. అంటే టిడిపి ఇండియా కూటమిలో చేరాలనుకొంటే అది నేరంగా తీర్మానించేసి, అందుకు చంద్రబాబు నాయుడుపై తమలాగ రాజకీయకక్ష సాధింపు మొదలుపెట్టమని బీజేపీ పెద్దలకు కూడా సూచిస్తున్నారన్న మాట! అందుకే వైసీపి రాజకీయధోరణి విచిత్రమైనదని చెప్పుకోవాలసి వస్తోంది.

ADVERTISEMENT
Latest Stories