మీ క్రెడిట్ మీరే ఉంచుకోండి… విభజన హామీలు అమలుచేయండి చాలు!

Vijaysai Reddyఏపీ బిజెపి అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి గురువారం బాధ్యతలు చేపట్టిన తర్వాత, జగన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాలన్నీ మావే అని చెప్పుకొంటోందని, ఏపీలో అభివృద్ధి పనులకు కేంద్రం లక్షల కోట్లు ఇస్తున్నా జగన్ ప్రభుత్వం నిర్వాకం వలన కేంద్రానికి, బిజెపికి చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె విమర్శలపై వైసీపీలో ఎవరూ ఇంత వరకు నోరు విప్పలేదు. అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చాలా జాగ్రత్తగా ఆచితూచి స్పందించారు.

“ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిగారికి తెలియజేయునది ఏమనగా, కేంద్ర ప్రభుత్వ పధకాల తాలూకు క్రెడిట్ సొంతం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఏనాడు ఆశపడలేదు. దయచేసి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణని నిలిపివేసి, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి, వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను. అలాగే ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వేజోన్, రైతులకు మద్దతు పెంచవలసిందిగా కోరుతున్నాను,” అని ట్వీట్‌ చేశారు.

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏపీలో అమలవుతున్న పలు సంక్షేమ పధకాల గురించి దగ్గుబాటి పురందేశ్వరి నిన్న వివరించి, వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఎంతెంత సొమ్ము ఇస్తోందో వివరంగా చెప్పి, ఆ పధకాలన్నిటికీ జగన్‌ స్టిక్కర్ అంటించుకొంటున్నారని ఆక్షేపించారు. అలాగే రాష్ట్రంలో వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చినా జగన్ ప్రభుత్వం సహకరించలేదని, కానీ రాజస్థాన్‌ ప్రభుత్వం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇప్పటి వరకు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు సాధించుకొని అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసుకొందని చెప్పారు.

ఏపీ ప్రభుత్వం వైఖరి కారణంగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని దగ్గుబాటి పురందేశ్వరి నిశితంగా విమర్శించారు. ప్రత్యేకహోదాకు మించి రాష్ట్రానికి నిధులు అందించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

దగ్గుబాటి పురందేశ్వరి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఎంపీ విజయసాయి రెడ్డి మళ్ళీ పాతపాటే పాడారు. నాలుగేళ్లుగా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. పోలవరం ప్రాజెక్టు కట్టవద్దని ఎవరైనా అడ్డుకొన్నారా?25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తామని చెప్పారు. కానీ నాలుగేళ్లుగా ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా గట్టిగా నిలదీసి అడిగే ధైర్యం లేదు. కారణాలు అందరికీ తెలుసు.

విశాఖ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంటే ఏనాడైనా సిఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అభ్యంతరం చెప్పారా? విభజన హామీల గురించి పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఎప్పుడైనా కేంద్రాన్ని గట్టిగా నిలదీశారా?జగన్ ప్రభుత్వానికి సంక్షేమ పధకాలు, వాటి కోసం అప్పులు, ఆ పధకాలతో వచ్చే ఓట్ల గురించి తప్ప మరిదేనిమీదైనా ఆసక్తి చూపిందా?

అయినా మంత్రులు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను విమర్శించడానికే మీడియా ముందుకు వస్తుంటారు తప్ప రాష్ట్రంలో ఫలానా అభివృద్ధి పనిచేస్తున్నామని ఎప్పుడైనా చెప్పడం ఎవరైనా విన్నారా?

చివరికి తెలంగాణ మంత్రులు కూడా ఏపీకి రాజధాని ఏది? అని అడుగుతుంటే మంత్రులు ఎవరూ సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. కనుక ఎవరో విమర్శిస్తే అందుకు వారిని తప్పు పట్టడం బాధపడటం దేనికి?

ADVERTISEMENT
Latest Stories