టీమిండియా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. వరుస విజయాలు అందుకుంటూ ఆస్ట్రేలియాను కూడా మట్టికరిపిస్తారని భావించిన క్రీడాభిమానులకు ట్విస్ట్ ఇస్తూ… కంగారులకు దాసోహం అంటుండడం క్రికెట్ ప్రేమికులకు ఏ మాత్రం రుచించడం లేదు. తొలి టెస్ట్ లో దారుణ పరాజయాన్ని చవిచూసిన టీమిండియా, రెండవ టెస్ట్ లోనైనా అదిరిపోయే రేంజ్ లో ప్రదర్శన ఇస్తుందని అంచనాలు వేసిన వారికి నిరాశనే కానుకగా ఇచ్చింది. దీంతో “విరాట్ కోహ్లి అండ్ కో”పై విమర్శల వర్షం కురుస్తోంది.
ప్రపంచంలోనే ‘సూపర్ బ్యాటింగ్ లైనప్’గా భావించిన టీమిండియా బ్యాట్స్ మెన్లను పేకమేడలా కుప్పకూలుస్తుండడం మన జట్టులోని లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. అత్యుత్తమ బౌలింగ్ ఉంటే తమ బ్యాటింగ్ ప్రదర్శన ఈ రేంజ్ లో ఉంటుందని ప్రపంచ క్రికెట్ కు చాటిచెప్తున్నట్లుగా ఉంది. ఎంత స్పిన్ కు, ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ అయినా కేవలం 189 పరుగులకు ఆలౌట్ అయ్యే అవకాశమైతే లేదన్నది స్పష్టం. కేవలం బ్యాట్స్ మెన్లపై ఉన్న ఒత్తిడి తప్పిదాలలో భాగంగా ఈ స్కోర్ కు ఆలౌట్ అయ్యారే తప్ప, ఇది పిచ్ ప్రభావం కాదన్నది స్పష్టం.
దీని నుండి బయటపడాలంటే ఒక్కటే మార్గం. ఇప్పటివరకు టీమిండియాను విజయవంతంగా ఒత్తిడిలోకి నెట్టిన ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టడమే సరైన మార్గం. ఇది గనుక విజయవంతంగా అమలు చేయగలిగితే, ఖచ్చితంగా టీమిండియా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఈ సిరీస్ పై ఆశలు వదులుకోవాల్సిందే అని చెప్పడంలో సందేహం లేదు. ఇదే సమయంలో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను 200 పరుగుల దరిదాపుల్లో ఆలౌట్ చేయగలితే, టీమిండియా మళ్ళీ గాడిలోకి వస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రెండింటికి మధ్య ఉన్న ఓ సన్నగీతే “ఆత్మవిశ్వాసం.” ప్రస్తుతం జట్టుకు లోపించింది అదే!



