కిడ్నాప్‌తో వైసీపీకి సంబందం లేదు… హైదరాబాద్‌ పారిపోలేదు!

Vizag MP MVV-Satyanarayana-Wife-Son-Kidnappedవిశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన కుటుంబం కిడ్నాప్ వ్యవహారంపై బుదవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. “కిడ్నాపర్లు నా భార్య, కుమారుడు, ఆడిటర్ జీవీలను చిత్రహింసలు పెట్టి చావు అంచుల వరకు తీసుకువెళ్లారు. కానీ పోలీసులు చాకచక్యంగా వారిని బందించి నా భార్య, కుమారులను రక్షించారు. ఈ కిడ్నాప్ కారణంగా మేము తీవ్ర ఆందోళన చెందుతుంటే, కొందరు ప్రతిపక్ష నాయకులు, మీడియా సంస్థలు దీనిని నా వ్యాపారాలతో, రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడుతుండటం నాకు చాలా బాధ కలిగించిది. అందుకే ఈ కిడ్నాప్ వ్యవహారం గురించి వాస్తవాలు తెలియజేసేందుకు మీడియా ముందుకు వచ్చాను.

కిడ్నాపర్లతో నాకు, నా కుటుంబ సభ్యులలు ఎటువంటి పరిచయాలు లేవు. వారు జైల్లో ఉన్నప్పుడే సులువుగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసుకొని ఈ కిడ్నాప్ చేశారు తప్ప, వారి వెనుక మా పార్టీకి చెందినవారు ఎవరూ లేరు. దీంతో మా పార్టీలో ఎవరికీ సంబంధం లేదు. ఏ రాష్ట్రంలోనైనా అప్పుడప్పుడు ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. కనుక ఈ కిడ్నాప్ కారణంగా విశాఖలో లేదా ఏపీలో శాంతి భద్రతలు సరిగాలేవని చెప్పడం సరికాదు.

ADVERTISEMENT

నేను వేధింపులు భరించలేక హైదరాబాద్‌ మకాం మార్చాననే వాదనలు కూడా ఖండిస్తున్నాను. విశాఖలో నేను అనేక వెంచర్స్ వేశాను. వేలాది ఇళ్ళు నిర్మించాను. నేను భూకబ్జాలు చేసి వాటిలో వెంచర్స్ వేసి వాటిని ప్రజలకు అంటగట్టి మోసగిస్తున్నానంటూ మీడియా దుష్ప్రచారం చేయడంతో నేను చాలా బాధపడ్డాను.

నా వలన పార్టీకి చెడ్డపేరు రాకూడదనే నేను హైదరాబాద్‌ మకాం మార్చి అక్కడ వ్యాపారం చేసుకొంటున్నాను తప్ప ఇక్కడ ఎవరో నన్ను వేధిస్తుండటం వలన కాదు,” అని సత్యనారాయణ అన్నారు.

రియల్ ఎస్టేట్ కమీషన్ల చెల్లింపులో తేడా వచ్చినందునే ఈ కిడ్నాప్ డ్రామా జరిగిందని, అప్పుడు ఎంపీ సత్యనారాయణ దిగిరావడంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు గంటల్లో డ్రామా ముగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంబాన్ని కిడ్నాపర్లు రెండు రోజులు వారి ఇంట్లోనే నిర్బందించి చిత్రహింసలు పెడుతుంటే, ఎంపీకి, పోలీసులకు తెలియకుండా ఉంటుందా?అని ప్రతిపక్షాల ప్రశ్న ఆలోచింపజేస్తుంది.

ఈ కిడ్నాప్ వ్యవహారంతో వైసీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది కనుక అధిష్టానం ఆదేశం మేరకు ఆయన మీడియా ముందుకువచ్చి పార్టీని, పోలీసులను వెనకేసుకువస్తూ ఈవిదంగా మాట్లాడి ఉండవచ్చని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. దీని వెనుక వైసీపీ నేతలెవరూ లేకపోతే ఈ కిడ్నాప్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories