ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు రెండు మూడు రాష్ట్రాలకు విస్తరించి ఉన్నందున ఈ కేసు ఏపీ సీఐడీ సమగ్రంగా విచారణ జరుపలేదని కనుక ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దాని విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది.
ఈ కేసు సీబీఐకి బదిలీ అయితే దాని వలన చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలకే చాలా మేలు కలుగుతుందని భావించవచ్చు. ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేనల చేతిలో ఓడిపోతామనే భయంతోనే వైసీపి ప్రభుత్వం ఇటువంటి తప్పుడు కేసులు సృష్టించి, అందరినీ జైలుకి పంపించి అడ్డుతొలగించుకోవాలని ప్రయత్నిస్తోందని టిడిపి వాదిస్తోంది. ఇది వైసీపి ప్రభుత్వం తమపై రాజకీయ కక్షతో సృష్టించిన తప్పుడు కేసు తప్ప దీనిలో ఎటువంటి కుంభకోణం లేదని టిడిపి మొదటి నుంచి వాదిస్తూనే ఉంది. అందుకే నేటికీ ఏపీ సీఐడీ కోర్టులో ఆర్ధిక నేరం జరిగిన్నట్లు సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయిందని టిడిపి వాదిస్తున్న సంగతి తెలిసిందే. తాము ఎటువంటి అవినీతికి పాల్పడలేదని వాదిస్తోంది. నేటికీ అది తన వాదనలకు కట్టుబడే ఉంది.
వివేకా హత్య కేసులో వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి దోషి అని సీబీఐ ముందే నిర్ధారించేసి ఆ కోణంలోనే విచారణ జరుపుతూ, ఆయనను ఈ కేసులో ఇరికించేయాలని ప్రయత్నిస్తోందని వైసీపి నేతలు ఆరోపించడం అందరూ వింటూనే ఉన్నారు.
అదేవిదంగా వైసీపి ప్రభుత్వం కనుసన్నలలో పనిచేస్తున్న ఏపీ సీఐడీ కూడా చంద్రబాబు నాయుడు తదితరులు ఆర్ధికనేరం చేశారని ముందే నిర్ణయించుకొని విచారణ జరుపుతోంది. కనుక వారు దోషులని నిరూపించేందుకే ప్రయత్నిస్తుంది. ఆ కోణంలోనే విచారణ జరుపుతుంది.
కనుక ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సీబీఐ చేతికి అప్పజెప్పడమే మంచిది. కనీసం అప్పుడైనా చంద్రబాబు నాయుడు తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొనేందుకు అవకాశం లభిస్తుంది. లేకుంటే ఈ కేసు కాకపోతే మరో కేసులో చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలను ఇరికించేందుకు వైసీపి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంటుంది.
ఈ కేసులలో చంద్రబాబు నాయుడుని దోషి అని నిరూపించలేకపోయినా ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలని కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లయితే పార్టీపై దృష్టి పెట్టలేని పరిస్థితి కలుగుతుంది. అలాగే ప్రతీరోజూ ఈ కేసులు, చంద్రబాబు నాయుడు రిమాండ్, బెయిలు, విచారణ, వాయిదా వార్తలు మీడియాలో వచ్చేలా చేస్తూ ఆయన ఇమేజ్ దెబ్బ తీయగలిగినా దాంతో టిడిపి దెబ్బ తింటుంది. ఎన్నికలవరకు ఈ వార్తలు మీడియాలో వచ్చేలా చేయగలిగితే ప్రజలలో కూడా క్రమంగా టిడిపి పట్ల ఎంతో కొంత అపోహలు, దురభిప్రాయం ఏర్పడుతుందని, దాంతో టిడిపిని సులువుగా ఓడించవచ్చని వైసీపి భావిస్తునట్లుంది.
కనుక ఈ కేసు సీబీఐ చేతికి వెళ్ళిన్నట్లయితే నిష్పక్షపాతంగా, వేగంగా విచారణ జరుగుతుంది. కనుక ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ ఉద్దేశ్యంతో ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని కేసు వేసినప్పటికీ అది చంద్రబాబు నాయుడుకి, టిడిపికి ఎంతో మేలు చేస్తుందని భావించవచ్చు.
—




