Vundavalli-Aruna-Kumar-target-Ramoji-Raoప్రత్యర్థులను నిజాల్లాంటి అబద్దాలతో, లాజిక్ లేకుండానే లాజిక్ గా చెబుతున్నట్టు, సంబంధం లేని పిట్ట కథలతో రకరకాల హావభావాల కథకళీ విన్యాసాలతో ఊపిరి పీల్చుకోనివ్వని ఉండవల్లి తను ఊపిరి పీల్చుకోవడం ఏమిటి అనుకుంటున్నారా? మార్గదర్శి విషయంలో వైసిపి ప్రభుత్వ చర్యలకు అనధికార చీఫ్ విప్ మాదిరిగా వకాల్తా పుచ్చుకుని రెండు రోజులకొక ప్రెస్ మీట్, సదస్సు పెట్టి గత పదహారేళ్ళుగా చెబుతున్న పసలేని వాదనలే అటు తిప్పి ఇటు తిప్పి వినిపిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఈసారి గట్టి ఎదురుదాడి తగిలింది. కొంత మంది నిపుణులు, సీనియర్ పాత్రికేయులు వివిధ వేదికల నుంచి ఉండవల్లి వాదనలో డొల్లతనాన్ని పాయింట్ టు పాయింట్ ఎండగడుతున్నారు. వారిలో ముఖ్యంగా ప్రముఖ పాత్రికేయులు కే. రమేష్ వంటి వారు తాను పూర్తి ఆధారాలతో వాదనకు సిద్దం అని ప్రకటించారు. కానీ ఎప్పటిలాగా అటు నుంచి స్పందన లేదు. ఇంక టిడిపి అధికార ప్రతినిధిగా ఉన్న యువ నాయకులు జి.వి రెడ్డి మీడియా ముఖంగా తాను మార్గదర్శి అంశంపై చర్చకు రెడీ అని తన వ్యక్తిగత హోదాలో ఒక వీడియెూ ద్వారా ప్రకటించారు.

జీవి సవాల్ విషయం అన్ని మీడియాల్లో ప్రముఖంగా రావడంతో ఉండవల్లి గొంతులో వెలక్కాయ పడింది, ఇక ప్రతిస్పందించక తప్పని పరిస్ధితిలో తాను తెలుగుదేశం ఆఫీసులోనైనా, రామెూజీ ఫిలింసిటీలోనైనా చర్చకు వస్తానని దీనిని తెలుగుదేశం పార్టీకి, రామెూజీరావు గారికి కూడా చుట్టేలా తన తెలివి ప్రదర్శించారు. జీవి రెడ్డి కూడా దీటుగా తాను కూడా వైసిపి ఆఫీసులోనైనా, సాక్షి ఆఫీసులోనైనా చర్చకు సిద్దం అని తిప్పికొట్టారు. దాంతో కాళ్ళు చల్లబడ్డ ఉండవల్లి అండ్ కో మరోరకంగా దాడి మెుదలుపెట్టింది. వైసిపి సోషల్ మీడియాల్లో “ఉండవల్లితో చర్చకు ఒక రెడ్డి తప్ప టిడిపికి, రామెూజీకి ఇంకొకరు దొరకలేదా” అంటూ కులాన్ని కూడా ఈ విషయంలోకి లాగడానికి ప్రయత్నించారు. అలా చర్చకు ముందే పార్టీ, కులం, అని రకరకాలుగా చర్చను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించారు.

Also Read – కవిత అనారోగ్యం ‘ఉపశమనాన్ని’ ఇస్తుందా.?

ఉండవల్లి ఇంతగా భయపడటానికి కారణం ఉంది. చర్చకు సిద్దమైన జివి రెడ్డి వృత్తి రిత్యా చార్టెడ్ ఎకౌంటెంట్, ఆర్ధిక విషయాల మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అంతే కాదు ఆయన అడ్వొకేట్ కూడా. ఆర్ధిక, న్యాయ పరమైన చట్టాలపైన పూర్తి అవగాన ఉన్న వ్యక్తి. ఆయన టివి చర్చలు, ప్రెస్ మీట్లు చూసే వారికి విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేసి వస్తారని అర్దం అవుతుంది. అంతేకాక సాదారణ రాజకీయ నాయకుల్లా ఎదుటి వారు రెచ్చగొడితే సహనం కోల్పోయే వ్యక్తి కాదు, కేవలం విషయం మీదే దృష్టి పెట్టి మాట్లాడతారు. ఇక ఉండవల్లి చూస్తే ఎప్పుడో దశాబ్దాల క్రితం కొన్ని సంవత్సరాలు ప్లీడరీ చేసారు, ఆయన వీది రౌడీలకు వకీలుగా చేసిన విషయాలు ఆయనే గతంలో చెప్పుకున్నారు. అంతకు మించి పెద్ద చరిత్రా లేదు. వకీలునని చెప్పుకునే ఉండవల్లి ఈ మద్య కాలంలో చూసిన కేసులు మార్గదర్శి ఫైనాన్స్, రాష్ట్ర విభజన విషయాలు. మెుదటిది రాజశేఖర్ రెడ్డి ఉండవల్లిని ముందు పెట్టి ఈనాడు గ్రూప్ మీద చేసిన దాడి. దాని మీద సంవత్సరాల తరబడి చేసిన హడావుడి తక్కువేమీ కాదు. రాజకీయంగా ఎంత వత్తిడి తెచ్చినా ఆర్బిఐ అది తప్పు అని చెప్పలేదు, హైకోర్టు ఆకేసు కొట్టివేసింది. ఇక ఇప్పటికీ రాష్ట్ర విభజన కేసుతో విభజన ఆపేస్తా అంటూ ఉండవల్లి చేసే ఫీట్లు చూసి చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటారు. అటువంటి ఉండవల్లి రకరకాలుగా ఒత్తిడి తెచ్చి ఈ చర్చ జరగకుండా చూడాలని చూసారని చెప్పుకుంటారు.

ఇటువంటి పరిస్థితిలో జివి రెడ్డి మరో అడుగు ముందుకేసి చర్చకోసం తనే వేదిక బుక్ చేసి ఉండవల్లికి తెలియచేసారు. అంతే అప్పటి వరకు రోజుకో ప్రెస్ మీట్, పూటకో సదస్సు అన్నట్టుగా ఉన్న ఉండవల్లి బయట కనబడటం మానేసారు. కానీ ఒక పక్క లోకేష్ యువగళం విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకోవడం, మరో పక్క చంద్రబాబు వివిధ సమస్యలపై క్షేత్ర స్ధాయిలో పోరాటాలు చేస్తున్న సమయంలో జీవి వ్యక్తి గతంగా చర్చకు వెళ్ళినా, వైసిపి దానిని గోబెల్స్ ప్రచారాలతో పార్టీ మీదకు రుద్ది మిగిలిన విషయాలను పక్కదోవ పట్టించగలదు కనుక ఈ చర్చను రద్దు చేసుకోవాలనే పార్టీ అదిష్టానం సూచనలతో చివరి నిమషంలో జీవి రెడ్డి చర్చకు తాను రాలేనని తెలియచేసారు. దాంతో నెత్తిన పాలుపోసినంత ఆనందంతో ఉండవల్లి అండ్ కో తోకముడిచిన టిడిపి అధికార ప్రతినిథి అంటూ మరో రకమైన ప్రచారం మెుదలు పెట్టింది. ఏదేమైనా చర్చ జరగకుండా ఉండాలని రకరకాల ఎత్తులు వేసిన ఉండవల్లికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు జీవినే రద్దు చేసుకోవడంతో బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు.

Also Read – ఏపీలో కమల ‘వికాసం’ సాధ్యమా.?