టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, జ్యూడిషియల్ రిమాండ్‌ను వైసీపి తప్ప బీజేపీతో సహా ప్రతిపక్షాలన్నీ ఖండించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టిడిపికి బేషరతుగా మద్దతు ప్రకటించి, టిడిపితో కలిసిపోరాడేందుకు ముందుకు వచ్చారు.
అయితే ఇప్పుడు టిడిపికి బయట నుంచి లభించే మద్దతు కంటే పార్టీ అంతర్గతంగా ఎంత పటిష్టంగా ఉందనేది చాలా ముఖ్యం. నిజానికిది టిడిపి శక్తి, సామర్ధ్యలను సమీక్షించుకొని, పరీక్షించుకొని, నిరూపించుకొనేందుకు మంచి అవకాశంగా టిడిపి నేతలు గ్రహిస్తే వారు త్వరగానే ఈ సంక్షోభం నుంచి పార్టీని గట్టెక్కించుకోగలరు.
ఇకపై వరుసపెట్టి కేసులు, అరెస్టులు ఉంటాయని వైసీపి మంత్రులు విస్పష్టంగా చెపుతున్నందున ఇప్పుడు ఈ సమస్యలను, సవాళ్ళను ఏవిదంగా ఎదుర్కోవాలి?పార్టీ శ్రేణులను ముందుండి ఎవరు నడిపించాలి?ఇక నుంచి వైసీపిని ధీటుగా ఎదుర్కోవడానికి ఎటువంటి కార్యాచరణ చేపట్టాలి?అనేవి చాలా కీలకం కానున్నాయి.
నారా లోకేష్ ఇప్పటికే యువగళం పాదయాత్రతో చాలా రాటు తేలారు. ప్రజాభిమానం సంపాదించుకొన్నారు. కనుక టిడిపిలో సీనియర్ నేతలందరితో కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పవచ్చు.
ఈ అగ్నిపరీక్షలో టిడిపి నేతలు విజయం సాధిస్తే వారిని ఇక ఏ శక్తి అడ్డుకోలేదు. కానీ ఈ బలహీన సమయంలో అదునుచూసి ఇంకా దెబ్బ తీద్దామని వైసీపి ఎదురుచూస్తోంది కనుక తొందరపాటు, దుందుడుకుతనం రెండూ కూడా చాలా ప్రమాదకరమే అని మారిచిపోకూడదు.



