కడప, మహానాడులో నారా లోకేష్‌ని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా నియమిస్తారని ఊహాగానాలు వినిపించాయి కానీ ఆ ప్రస్తావన లేకుండానే మహానాడు ముగిసింది.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యువగళం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డిని చాలా ధైర్యంగా, ధీటుగా ఎదుర్కొన్నారు నారా లోకేష్.
ఇప్పుడు మంత్రిగా, ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్నారు. అటు పార్టీ నాయకుడుగా, ఇటు మంత్రిగా నారా లోకేష్ తన సమర్దత నిరూపించుకున్నారు. కనుక ఆయనకు తక్షణం ప్రమోషన్ ఇవ్వాలని పార్టీలో సీనియర్ నేతలే కోరుతున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీలు చేసిన చారిత్రిక తప్పిదాల గురించి చెప్పుకోవడం చాలా అవసరం. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉన్నాయి.
కానీ అప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని పదవి చేపట్టేందుకు నిరాకరించారు. తెలంగాణలో కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని తహతహలాడినప్పటికీ ఆయన తండ్రి కేసీఆర్ అంగీకరించలేదు.
కనుక రాహుల్ గాంధీ, కేటీఆర్ ఇద్దరూ ఓ గొప్ప అవకాశం కోల్పోయారు. రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత రెండు పార్టీలు బలహీన పడ్డాయి కూడా.
జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కనుక రాహుల్ గాంధీ, కేటీఆర్ ఆ పదవుల కోసం ఆశపడుతున్నా అవి దక్కే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపధ్యంలో టీడీపీని చూస్తే, 2019 ఎన్నికలలో వైసీపీ చేతిలో ఓటమి పాలైంది. జగన్ అధికారంలోకి రాగానే టీడీపీని తుడిచిపెట్టేయడానికి చేసిన కుట్రలు, కేసులు, వేధింపులు, అరెస్టులు చూస్తున్నప్పుడు, వాటిని తట్టుకోలేక టీడీపీ చిన్నాభిన్నమైపోతుందని అనిపించింది.
ఒకవేళ అయిపోయి ఉంటే నారా లోకేష్ పరిస్థితి కూడా రాహుల్, కేటీఆర్ పరిస్థితి అయ్యుండేది కదా? కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు చాలా నిబ్బరంగా నిలబడి పోరాడుతూ టీడీపీని కాపాడుకున్నారు.
కానీ 2029 నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. 2029 ఎన్నికలలో మనమే తప్పకుండా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని, అప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా అందరిపై ఇంతకి ఇంతా ప్రతీకారం తీర్చుకుంటామని జగన్ పదేపదే హెచ్చరిస్తున్నారు కూడా.
కనుక యువగళం యాత్రలో జగన్‌ని ధీటుగా ఎదుర్కొని, మంగళగిరిలో గెలిచి, పార్టీని గెలిపించుకున్న యువ నాయకుడు నారా లోకేష్‌కి ప్రమోషన్ ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించి సిఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా ప్రభుత్వం, పాలన, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నాలుగేళ్ళలో నారా లోకేష్ ఇటు రాజకీయాలలో, అటు పాలనలో మరింత రాటు తెలుతారు. పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే టీడీపీని మరింత బలోపేతం చేసుకుంటూ తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ, పార్టీని ముందుకు తీసుకువెళతారు. 2029 ఎన్నికలనాటికి ఆయనతో పాటు పార్టీ కూడా సిద్దంగా ఉంటుంది.
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు మాదిరిగా ఆలస్యం చేయకుండా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిది కదా?






