ఒక్కసారిగా సినీ వర్గాల్లో కలకలం రేపిన గాయని సుచిత్ర కార్తీక్ ప్రస్తుతం ఏం చేస్తోంది? ఒక సాధారణ గాయకురాలిగా ఉంటే, బహుశా ఈ ప్రశ్నకు ఆస్కారం ఉండేది కాదేమో గానీ, ఇటీవల ట్విట్టర్ వేదికగా సుచిత్ర బయటపెట్టిన “సుచీలీక్స్” వ్యవహారం తర్వాత నెటిజన్లలో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న సుచిత్ర పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే… తన మానసిక పరిస్థితి సరిగా లేదని భర్త కార్తీక్ తెలుపగా, భర్తతో విడాకులు తీసుకుంటున్నానని సుచిత్ర ప్రకటించింది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో సుచిత్ర వ్యవహారశైలిపై విభిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. భర్త చెప్తున్నట్లు సుచిత్ర మానసిక పరిస్థితి సరిగా లేకపోతే… ట్విట్టర్ వేదికగా బయటపెట్టిన వీడియోలు, ఫోటోలలో తన వీడియోలు గానీ, ఫోటోలు గానీ ఎక్కడ బయటపెట్టలేదు కదా! అలాగే ట్విట్టర్ వేదికగా డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయితో చేసిన ట్వీట్స్ ను చూసిన వారు సుచిత్ర మానసిక పరిస్థితి బాగోలేదు అంటే ఖచ్చితంగా ఒప్పుకోరు. ఇక సుచిత్ర చెప్పిన “హ్యాకింగ్” కబుర్లు వింటే మరింత అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది.
నిజంగా హ్యాకింగ్ జరిగితే ఇప్పటివరకు సైబర్ క్రైమ్ వారిని సుచిత్ర ఎందుకు ఆశ్రయించలేదు? కేసు ఎందుకు నమోదు చేయలేదు? అయినా ఎవరి అకౌంట్ అయినా హ్యాకింగ్ కు గురైతే, ఒక రోజు, రెండు రోజుల పాటు మాత్రమే ఉంటుంది గానీ, ఇలా సుచిత్ర ఉదంతంలో జరిగినట్లు వారం వారం రోజులు ఉండదన్న విషయం తెలిసిందే. అలాగే తన భార్య ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని తొలుత చెప్పిన భర్త కార్తీక్, రెండవసారి మాత్రం సుచిత్ర మానసిక పరిస్థితి గురించే చెప్పారు తప్ప, హ్యాకింగ్ ప్రస్తావన తీసుకురాలేదు.
సరే… ఇప్పుడు ఇదంతా గత చరిత్ర. ప్రస్తుతం చిత్ర ఏం చేస్తోంది? అంటే లండన్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది అన్న సమాచారం లభిస్తోంది. కోలీవుడ్ వర్గాల నుండి వచ్చిన బెదిరింపుల కారణంగానే లండన్ వెళ్తోందా? లేక తన మానసిక పరిస్థితిని మెరుగు పడేందుకు వాతావరణ మార్పులో భాగంగా లండన్ పయనమవుతోందా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ లో ఇంత ప్రకంపనలు సృష్టించిన సుచిత్ర, లండన్ వెళ్లి మాత్రం హాయిగా ఉండగలుగుతుందా? అన్న ప్రశ్నార్ధకమే! అయితే “సుచి సునామీ”కి మాత్రం ‘శుభంకార్డ్’ పడినట్లేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు.



