ఈ క్రెడిట్ గోలేమిటో!

Gudivada Amarnath

విశాఖకి గూగుల్ వస్తుంటే, దానిని దక్కించుకోలేకపోయిన ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఆర్తనాదాలు చేస్తుంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ అది వస్తోందని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పినప్పటి నుంచి వైసీపీ కూడా ఆర్తనాదాలు చేస్తుండటమే విచిత్రం.

మొదట దాని వలన నష్టమే తప్ప పైసా లాభం ఉండదని సన్నాయి నొక్కులు నొక్కిన వైసీపీయే ఆ తర్వాత అది ఏపీకి రావడానికి నాడు తాము చేసిన కృషే కారణమని వాదిస్తోంది.

ADVERTISEMENT

దానికి సంబంధించి పేపర్ కటింగ్స్ సాక్ష్యాధారాలుగా చూపిస్తూ, తమకు దక్కాల్సిన ఆ క్రెడిట్ సిఎం చంద్రబాబు నాయుడు చోరీ చేస్తున్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోషల్ మీడియాలో ఆర్తనాదాలు చేశారు.

రాష్ట్ర భవిష్యత్తును సమూలంగా మార్చేయగల కీలకమైన శాఖ… ఐటి, పరిశ్రమల శాఖ! అలాంటి శాఖకు మంత్రిగా పని చేసిన గుడివాడ ఏనాడూ దేశ విదేశాలకు వెళ్ళి పెట్టుబడిదారులతో మాట్లాడింది లేదు. శాఖకు సంబందించిన విషయాలు మాట్లాడని అనేక మంది మంత్రులలో గుడివాడ కూడా ఒకరు.

ఎందుకంటే అందరూ నిమిత్తమాత్రులు. ఎవరికీ తమ శాఖలపై అవగాహన కూడా ఉండేది కాదు. పైగా వైసీపీ హయంలో సంక్షేమ పధకాల గోల తప్ప పరిశ్రమలు, ఐటి కంపెనీల ఊసే ఉండేది కాదు.

కనుక చాలా మంది మంత్రులకు పని ఉండేది కాదు. అందువల్ల ప్రతీరోజూ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ల భజన చేస్తూ 5 ఏళ్ళు కాలక్షేపం చేసేవారు. వారిలో కొందరు రసికులు, కళాపోషకులు తమ మాటలతో, డాన్సులతో ప్రజలను రంజింపజేసేవారు. అలాంటి వారందరూ ఇప్పుడు తమ తమ శాఖల వారీగా స్పందిస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కదా?

ఇక ఈ క్రెడిట్ గోల గురించి కూడా రెండు ముక్కలు చెప్పుకోవాలి. వైసీపీ ప్రభుత్వం ఆర్నేల్లో, ఏడాదో పాలించి దిగిపోలేదు. పూర్తి మెజార్టీతో 5 ఏళ్ళు పూర్తిగా పాలించే దిగిపోయింది.

అంత మెజార్టీతో అన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవలీలగా అనేక అభివృద్ధి పనులు చేసి ఆ క్రెడిట్ తీసుకోవచ్చు. కానీ తామే స్వయంగా కనిపెట్టిన మూడు రాజదానులతో సహా దేనినీ పూర్తి చేయలేకపోయింది. కనీసం అమరావతి, పోలవరం నిర్మాణ పనులను పూర్తి చేసి ఉండి ఉంటే ఆ క్రెడిట్ వైసీపీకి దాని అధినేత జగన్మోహన్ రెడ్డికే దక్కి ఉండేది. ఆ శిలా ఫలకాలపై వారి పేర్లే శాస్వితంగా ఉండేవి కదా?

కానీ అమరావతి నిర్మించడం చాలా కష్టం. కనుక బస్ షెల్టర్స్, గ్రామ సచివాలయాలు నిర్మించి వాటికి వైసీపీ రంగులు, జగన్‌ ఫోటోలు పెట్టుకొని ‘శభాష్ శభాష్’ అంటూ భుజాలు చరుచుకున్నారు.

నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా రాజధాని నిర్మించవద్దని అడ్డుకున్నారా? ఎవరైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుపడ్డారా? ఎవరైనా రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మించకుండా అడ్డుకున్నారా?

ఎవరైనా పరిశ్రమలు, ఐటి కంపెనీలు రప్పించకుండా అడ్డుకున్నారా?ఎవరైనా డీఎస్సీ, ఉద్యోగాలు భర్తీ చేయకుండా అడ్డుకున్నారా? లేదు కదా?ఇవన్నీ చేసి ఉంటే ఆ క్రెడిట్ వైసీపీకి దాని అధినేత జగన్మోహన్ రెడ్డికే దక్కి ఉండేది కదా?

కానీ ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ విలువ తెలుసుకోకుండా, వారి ఆకాంక్షలు, రాష్ట్ర అవసరాలు ఏవీ తెలుసుకోకుండా పుర్రెకు పుట్టిందే బుద్ధి అన్నట్లు ఐదేళ్ళపాటు బటన్ నొక్కుడు-సంక్షేమ పధకాలు, రాజకీయ కక్షలతోనే కాలక్షేపం చేసేశారు.

కానీ ఇప్పుడు ఆనాడు మేమే గోతులు తవ్వాము… వాటిలో చంద్రబాబు నాయుడు మొక్కులు నాటితే, అవి వృక్షాలుగా ఎదిగి ఫలాలు ఇస్తే ఆ క్రెడిట్ మాదే కదా? ఆనాడు మేమే సంతకాలు చేశాము కనుక కంపెనీలు వస్తే ఆ క్రెడిట్ మాదే కదా? అని చెప్పుకుంటే ప్రజలు నవ్వరా? నవ్వితే నవ్విపోదురు గాక అనుకుంటే…. నవ్వులపాలే అవుతారు.

ADVERTISEMENT
Latest Stories