తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఎంత ఉత్కంఠగా, ఎంత రసవత్తరంగా సాగాయో అందరూ చూశారు. ఆ ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోయి ప్రగతీ భవన్, ఖాళీ చేయాల్సిరావడం, సచివాలయంలో ప్రవేశించడానికి అనుమతి లభించని రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ ముచ్చటపడి కట్టించుకున్న ముఖ్యమంత్రి ఛాంబర్‌లో కూర్చొని రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.
రాజకీయాలలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడో అప్పుడు జరుగుతూనే ఉంటాయి. కనుక ఇవేమీ అసాధారణమైనవి కావు. కానీ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినా కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ ప్రభుత్వంపై సింహాల్లా గర్జిస్తుండటం, ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరిస్తుండటమే చాలా విచిత్రంగా ఉంది. కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ లభించకపోవడమే ఇందుకు కారణమని అర్దమవుతూనే ఉంది.
అయితే సిఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు కూడా వారి బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా తిరిగి అంతే ధీటుగా ఎదురుదాడి చేస్తుండటం విశేషం. సిఎం రేవంత్ రెడ్డి లండన్‌లో “తెలంగాణవాసులతో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ తుడుచిపెట్టుకుపోతుంది. ఆ పార్టీని 100 అడుగుల లోతున కప్పి పెడతాను. ఆ పార్టీ నేతల పొగరు, అహంకారం తగ్గించే బాధ్యత నేనే తీసుకుంటాను,” అని హెచ్చరించారు.
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఇలాంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నాయని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రజలకు తమపై పూర్తి నమ్మకం కలిగేలా చేయడమే వాటి ఉద్దేశ్యం.
అయితే రెండు పార్టీలు ఏదో రోజు బహుశః లోక్‌సభ ఎన్నికలకు ముందే లేదా ఎన్నికల తర్వాత పరస్పరం ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నించడం ఖాయం. ఎందుకంటే పదేళ్ళపాటు అధికారంలో ఉండే మజాని రుచి చూసిన కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ నేతలు మరో 5 ఏళ్ళపాటు అధికారానికి దూరంగా బ్రతకలేరు. అలాగే బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి ప్రభుత్వ మనుగడకు ప్రమాదమే.
కనుక లోక్‌సభ ఎన్నికల తర్వాత రెంటిలో ఏదో ఒకటి కూలిపోవడమో లేదా చీలిపోవడమో ఖాయమే. రేవంత్ రెడ్డి అప్పుడే ప్రభుత్వం మీద, పార్టీ మీద, రాష్ట్రంలో వ్యవస్థల మీద పట్టు సాధించారు. కనుక ఆయనకే బిఆర్ఎస్ పార్టీని చీల్చి దెబ్బ తీసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.




