షర్మిలకి చెక్ పెట్టగల ధీరుడు వైసీపిలో ఎవరు..ఎవరు… ఎవరు?

YS Sharmila Jagan Vijayamma

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డికి కంట్లో నలుసులా, చెప్పులో రాయిలా చాలా ఇబ్బంది పెడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కేవలం ఇబ్బందే అయితే ఎలాగో భరించేయవచ్చు కానీ ఆమె ఏకంగా అన్న కుర్చీకే ఎసరు పెడుతుండటంతో ఆమెకు చెక్ పెట్టక తప్పదు.

జగన్‌ తన మంత్రులు, ఎమ్మెల్యేలతో, సొంత మీడియాతో చెల్లి వైఎస్ షర్మిలను తిట్టిస్తుండటం వలన వైసీపి ఇంకా నష్టమే తప్ప లాభం ఉండదని తెలుసు. అలాగని జగన్‌ స్వయంగా చెల్లెలు విమర్శలకు, ఆరోపణలకు జవాబులు చెప్పుకోవడం మొదలుపెడితే ఈ ప్రశ్నా జవాబుల కార్యక్రమానికి అంతే ఉండదు. పైగా దాంతో ఆమె ప్రజలలో మరింత పాపులర్ అవుతారు ఆమెకు సానుభూతి పెరుగుతుంది. అదే జరిగితే వైసీపికి ఇంకా నష్టం జరుగుతుంది.

ADVERTISEMENT

మరైతే చెల్లికి వైసీపిలో చెక్ పెట్టగలవారు ఎవరు?ఎవరు? ఎవరు?అని భూతద్దం పెట్టుకుని వెతికితే తల్లి విజయమ్మ కనబడుతున్నారు.

చెల్లి చేస్తున్న ఆరోపణల వలన తమ కుటుంబం పరువు బజారున పడుతోందని, కనుక ఆమె ఆరోపణలు తప్పని ప్రజల ముందుకు వెళ్ళి చెప్పాలని తల్లి విజయమ్మను జగన్‌ కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ గుసగుసలు నిజమే అయితే నేడో రేపో విజయమ్మ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఎలాగూ మాట్లాడుతారు.

కానీ ఆనాడు తల్లి విజయమ్మ కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతుంటే ఆమెను చిర్నవ్వుతో పార్టీలో నుంచి బయటకు సాగనంపిన జగన్మోహన్‌ రెడ్డికి, మళ్ళీ ఇప్పుడు అదే తల్లి సాయం అవసరం పడటం దేవుడి స్క్రిప్ట్ కాకపోతే మరేమిటి?

ఆమె తల్లి మనసు కొడుకుని క్షమించి ఆయన పక్షాన్న నిలబడి మాట్లాడేందుకు ప్రజల ముందుకు వస్తే, కూతురు వలన కొడుకుకి, వైసీపికి జరుగుతున్న నష్టాన్ని తగ్గించగలరా? కొడుకు విశ్వసనీయతని పెంచగలరా? కూతురు కంటే కొడుకే మంచివాడు… ఉత్తముడు అని చెప్పగలరా? చెప్పినా ప్రజలు నమ్ముతారా? అంటే కాదనే చెప్పవచ్చు.

ఒకవేళ ఆమె కూడా ప్రజల మద్యకు వచ్చి మాట్లాడటం మొదలుపెడితే, రాజకోట రహస్యాలు బయటపెడితే… పోయేది వైఎస్ కుటుంబం పరువే! నష్టపోయేది ఆమె కొడుకు, వైసీపి పార్టీలే!

ఇంతకాలం చంద్రబాబు నాయుడు తమ వైఎస్ కుటుంబాన్ని చీల్చుతున్నారని జగన్‌ ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు చెల్లికి చెక్ పెట్టడం కోసం తల్లిని బయటకు తీసుకువస్తే, ఆయనే స్వయంగా తమ కుటుంబాన్ని చీల్చాడనే వైఎస్ షర్మిల ఆరోపణలకు మరింత బలం చేకూరుతుంది కదా?

కనుక జగన్‌ చెల్లికి చెక్ పెట్టేందుకు ఒకవేళ తల్లి విజయమ్మని బరిలో దించితే, అదే ఆయన పతనంలో తుది అంకం కావచ్చు. విజయమ్మ ఏ గట్టున ఉంటారో తెలీదు కానీ అన్నా చెల్లెళ్ళ మద్య జరుగుతున్న ఈ యుద్ధానికి ఆమె ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నారు పాపం విజయమ్మ!

ADVERTISEMENT
Latest Stories