తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది? బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ?కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా?కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్, బిఆర్ఎస్ నేతల పరిస్థితి ఏమిటి?రెండు పార్టీలకు మెజార్టీ రాకపోతే పరిస్థితి ఏమిటి?అనేక ప్రశ్నలకు డిసెంబర్ 3వ తేదీన వెలువడే ఫలితాలు సమాధానం చెపుతాయి. అయితే ప్రస్తుతం బిఆర్ఎస్‌కి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది.
బిఆర్ఎస్ పార్టీకి 72-76 సీట్లతో అధికారంలోకి రావచ్చునని సర్వేలు సూచిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ సభలకు వస్తున్న స్పందన గమనిస్తే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటున్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ ప్రచారం, అది అనుసరిస్తున్న వ్యూహాలు ఈసారి కాంగ్రెస్‌ని గెలిపించవచ్చు.
ఈ లెక్కన కాంగ్రెస్ 119స్థానాలలో 75-80 సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావచ్చు లేదా తీవ్ర పోటీ కారణంగా 55-60 సీట్ల వరకు వచ్చి ఆగిపోవచ్చు.
అదే కనుక జరిగితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోతారని ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందే జోస్యం చెప్పారు. కనుక కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించలేకపోతే దాని కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. బిఆర్ఎస్‌తో ఇంత పోరాటం చేసి చివరికి దానినే మళ్ళీ అధికారంలోకి తెచ్చిన్నట్లవుతుంది.
బిఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్‌లో అరడజను మంది ఆ పదవికి పోటీ పడుతున్నారు కనుక కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు?అంటే తెలంగాణలో ఇక ఎన్నటికీ కోలుకోలేదనుకొన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినందుకుగాను కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సిఎంగా చేయవచ్చు. ఆ ధీమాతోనే ఆయన డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు కూడా.
ఒకవేళ బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. బిఆర్ఎస్ నేతలందరూ యధాతధంగా పని చేసుకొంటారు. కానీ బిఆర్ఎస్ ఓడిపోతే? అధికారంలోకి రాలేకపోతే? ఎమ్మెల్యేలలో కొందరు కాంగ్రెస్‌లో చేరిపోవచ్చు. మిగిలినవారు ప్రతిపక్ష బెంచీలకు షిఫ్ట్ అయిపోతారు.
కేసీఆర్ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమే. పైగా ఇది ఆయన జాతీయ రాజకీయ ప్రవేశంపై కూడా ప్రభావం పడుతుంది. అయినప్పటికీ కేసీఆర్ తనకు లభించే ఖాళీ సమయాన్ని వినియోగించుకొని జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయమే.
ముందుగా తెలంగాణ, మహారాష్ట్రలలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తన పార్టీ పరిస్థితి, కాంగ్రెస్, బీజేపీల పరిస్థితిని బట్టి ఏదో ఓ కూటమితో చేతులు కలపవచ్చు. ఏపీలో జగన్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయిపోవచ్చు.






