revanth-reddy-kcr-sunkishala

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి మరో 50 ఏళ్ళ వరకు తాగునీటికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ హయాంలో నాగార్జున సాగర్ సమీపంలో సుంకీశాల వద్ద పంప్‌ హౌస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సాగర్‌లో నీటి నిలువ కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ హైదరాబాద్‌కు తాగునీటికి ఇబ్బంది ఉండకూడదని ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.

Also Read – శ్రీ వారి లడ్డు…ప్రసాదం కాదు ఒక ఎమోషన్..!

అయితే సుంకీశాల పంప్‌ హౌస్‌ సాగర్‌కు చాలా సమీపంలో భూగర్భంలో నిర్మిస్తున్నందున కృష్ణ జాలాలు నిర్మాణంలో ఉన్న పంప్‌ హౌస్‌లో ప్రవేశించకుండా ఉంచేందుకు సొరంగ మార్గానికి అడ్డంగా సుమారు 40 అడుగుల ఎత్తైన కాంక్రీట్ రీటెయినింగ్ వాల్ నిర్మించారు.

కానీ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో ఆగస్ట్ 2వ తేదీ ఉదయం 6 గంటలకు రీటెయినింగ్ వాల్ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అలాగే పంప్‌ హౌస్‌ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నందున పెద్దగా ఆస్తి నష్టం కూడా జరుగలేదు.

Also Read – బాలినేని ఈ సారి ‘రాజీ’ పడలేదు..!

కానీ పంప్‌ హౌస్‌ నిర్మాణంలో ఉండగానే రీటెయినింగ్ వాల్ కూలిపోవడం, ఆగస్ట్ 2వ తేదీన కూలిపోతే ఈ విషయం బయటకు పొక్కకుండా తెలంగాణ ప్రభుత్వం దాచిపెట్టడంతో అధికార కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య కొత్త యుద్ధం మొదలైంది.

సుంకీశాల పంప్‌ హౌస్‌ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే ఈ ప్రమాదం జరిగిందని, అందుకే ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టిందని కేటీఆర్‌ విమర్శించారు.

Also Read – కేసీఆర్‌, చంద్రబాబుకి తేడా ఇదేగా!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “బిఆర్ఎస్ హయాంలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే అవినీతి జరిగిందని, మిగిలిన ప్రాజెక్టులన్నీ బాగానే ఉన్నాయని ఇంతకాలం అనుకున్నాము. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం ఏ ప్రాజెక్టుని వదిలిపెట్టలేదని తాజా ఘటనతో నిరూపితమైంది.

కేసీఆర్‌ కమీషన్లకు కక్కుర్తి పడటం వలననే లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు క్రుంగిపోయి ఎందుకూ పనికి రాకుండా పోయింది. దాని ఎగువ నిర్మించిన బ్యారేజీల గోడలకు కూడా పగుళ్ళు ఏర్పడి నీళ్ళు నిలువచేయలేని దుస్థితి ఏర్పడింది.

ఇప్పుడు సుంకీశాల పంప్‌ హౌస్‌లో కూడా నాసిరకం పనులు జరిగిన్నట్లు తేలింది. దీనిపై విచారణ జరిపించి దీని వెనుక ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు తెలియజేస్తాము,” అని భట్టి విక్రమార్క అన్నారు.




కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్‌, బిఆర్ఎస్ నేతలు చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆవిప్పుడు నీళ్ళని నిలువచేయడానికి కాక కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుండటం విశేషం. ఇంతకీ ఈ సుంకీశాల పాపం కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీ దేని పద్దులో వ్రాసుకోవాలో?